విదేశాల్లో సమాంతర ప్రభుత్వ ఏర్పాటుకు కుట్ర

  • వెనిజులా మంత్రి కాబెల్లో

కారకస్‌ : దేశ రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా దేశానికి వెలుపల సమాంతర అధ్యక్ష అధికారాలను ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారంటూ వెనిజులా పౌరుల భద్రతా వ్యవహారాల మంత్రి కాబెల్లొ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రతిపక్ష అభ్యర్ధిని అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయించేందుకు మితవాదులు పన్నిన కుట్ర వివరాలను ఆయన బుధవారం వెల్లడించారు. ఓడిపోయిన అధ్యక్ష అభ్యర్ధి ఎడ్ముండో గొంజాలెజ్‌ ప్రమాణ స్వీకారంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారని కాబెల్లొ చెప్పారు. దీనిపై 21పేజీల డాక్యుమెంట్‌ను అందచేశారు. విదేశాల్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది వారి లక్ష్యంగా వుందన్నారు. దేశ రాజ్యాంగంలోని 231వ అధికరణ కింద దీన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా కాబెల్లొ నిరసించారు. అధ్యక్షుని ప్రమాణ స్వీకారాలు పార్లమెంట్‌ వెలుపల, మన దేశ భూభాగంపై జరగాలన్నారు. కానీ వారు రాజ్యాంగాన్ని పక్క దోవ పట్టించాలని చూస్తున్నారని అన్నారు. మాజీ అధ్యక్ష అభ్యర్ధి ఎన్‌రిక్‌ మార్క్వెజ్‌ కంప్యూటర్‌లో ఈ డాక్యుమెంట్‌ను కనుగొన్నారు. ప్రతిపక్ష నేతలను ఉద్దేశించి ఈ డాక్యుమెంట్‌ రూపొందించారు. ఇటీవల ఎఫ్‌బిఐ ఏజెంట్‌ను అరెస్టు చేయడానికి ఈ పరిణామాలకు సంబంధం వుందని కాబెల్లొ పేర్కొన్నారు. వెనిజులాలో రెండు దశాబ్దాలకు పైగా కార్యకలాపాలతో ఆ ఏజెంట్‌కు సంబంధం వుందన్నారు. ఈ ఏజెంట్‌ను అరెస్టు చేయడంతో పాటూ ఇద్దరు కొలంబియా కిరాయి వ్యక్తులను నిర్బంధించారు.

➡️