ఇమ్రాన్‌ ఖాన్‌పై అవినీతి కేసు విచారణ వాయిదా

May 16,2024 00:22 #bail case, #Imran Khan

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై గల అవినీతి కేసు విచారణను 17వ తేదీ వరకు పాక్‌లోని అకౌంటబిలిటీ కోర్టు వాయిదా వేసింది. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖైదీగా వున్న అడియాలా జైల్లో భద్రతా పరమైన ఆందోళనలను ఇందుకు కారణంగా పేర్కొంది. గతేడాది ఆగస్టు నుండి రావల్పండిలోని అడియాలా జైల్లో ఇమ్రాన్‌ వున్నారు. భద్రత సరిగా లేనందున విచారణను వాయిదా వేయాల్సిందిగా జైలు సూపరింటెండెంట్‌ చేసిన అభ్యర్ధనను కోర్టు ఆమోదించిందని ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పేర్కొంది. పంజాబ్‌లోని జైళ్ళపై దాడి చేస్తామంటూ కొన్ని నిషేధ సంస్థలు హెచ్చరికలు చేశాయని, పంజాబ్‌ రాష్ట్ర హోం శాఖకు ఈ మేరకు బెదిరింపులు వచ్చాయని జైలు అధికారులు తెలిపారు. పంజాబ్‌ రాష్ట్రంలోనే అడియాలా జైలు అత్యంత సున్నితమైనది. ఇందులో 7వేల మందికి పైగా ఖైదీలు వున్నారు. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారితోపాటూ రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడ వున్నారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో జైలు చుట్టుపక్కల భద్రతను, బందోబస్తును పెంచామని చెప్పారు.

➡️