ఒక్కో మైగ్రెంట్‌కు 4675 డాలర్ల ఖర్చు!

  • ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ కన్నా అధికం !
  • గ్వాటెమాలాకు తరలింపు ప్రక్రియపై డేటా వెల్లడి

గ్వాటెమాలా సిటీ : చట్టబద్ధమైన పత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వారిని బలవంతంగా వారి స్వదేశాలకు పంపించే ప్రక్రియ గత వారం రోజుల నుండి శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు లాటిన్‌ అమెరికా దేశాలకు ఆరు విమానాలను పంపించారు. వీటిలో అమెరికాకు రెండు కార్గో విమానాలను తమ దేశంలో దిగేందుకు కొలంబియా నిరాకరించింది. ట్రంప్‌తో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో మైగ్రెంట్లను తీసుకొచ్చేందుకు తమ స్వంత విమానాలనే పంపించింది. మిగిలిన నాలుగు విమానాలు గ్వాటెమాలా లోనే దిగాయి. ఇందులో భాగంగా గ్వాటెమాలాకు వెళుతున్న మిలటరీ విమానంలో ఒక్కో మైగ్రెంట్‌కు 4675 డాలర్లు ఖర్చవుతోంది. టెక్సాస్‌లోని ఎల్‌పాసో నుండి అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో గ్వాటెమాలాకు వెళ్లాలంటే అయ్యే ఫస్ట్‌ క్లాస్‌ టిక్కెట్‌ కన్నా ఇది ఐదు రెట్లకు మించి అధికమని అమెరికా, గ్వాటెమాలా అధికారులు అందజేసిన డేటా పేర్కొంటోంది. ఫస్ట్‌ క్లాస్‌ టికెట్‌ ధర 853 డాలర్లుగా వుంది. పైగా అమెరికా ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి చెందిన కమర్షియల్‌చార్టర్‌ విమానానికి అయ్యే ఖర్చు కన్నా కూడా ఇది చాలా ఎక్కువ.

సి-17 సైనిక రవాణా విమానానికి గంటకు 28,500 డాలర్లు నిర్వహణా వ్యయం అవుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. గ్వాటెమాలాకు వెళ్లి రావడానికి పదిన్నర గంటలు పడుతుంది. విమానాశ్రయంలో ఆగిన సమయాన్ని, లేదా టేకాఫ్‌ ఆపరేషన్స్‌కు పట్టే సమయాన్ని ఇందులో కలపలేదని ఆ అధికారి తెలిపారు. 64మందితో సోమవారం సైనిక రవాణా విమానం ఒకటి ఇక్కడకు వచ్చిందని గ్వాటెమాలా అధికారి తెలిపారు.

బానిసల పిల్లల కోసం తెచ్చారు.. జన్మత: పౌరసత్వంపై ట్రంప్‌ వ్యాఖ్యలు

 బానిసల పిల్లల కోసం ఉద్దేశించి జన్మత: పౌరసత్వం తీసుకువచ్చారని, కానీ ప్రపంచమంతా ఇక్కడకు వచ్చి పోగుపడేందుకు కాదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజే జన్మత: పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తూ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ 22 రాష్ట్రాల్లో ఐదు కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజే సియాటెల్‌లోని ఫెడరల్‌ కోర్టు ట్రంప్‌ ఉత్తర్వులను కొట్టివేసింది. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ట్రంప్‌ చెప్పారు. ”జన్మత:పౌరసత్వం చట్టాన్ని బానిసల పిల్లల కోసం ఆనాడు తెచ్చారని అన్నారు.. అంతేకానీ ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన జనం అమెరికాకు వచ్చి ఇక్కడ ఆక్రమించడానికి కాదని అన్నారు.

➡️