కోర్టు ఆదేశాలూ బేఖాతరు

Feb 11,2024 10:19 #Court orders, #ignored, #Uttarakhand
  • ఉత్తరాఖండ్‌ అధికారుల అమానుషం
  • మసీదు, మదర్సా కూల్చివేత
  • హింసాకాండలో ఐదుగురు మృతి

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు రెండు రోజుల క్రితం నగరంలోని బన్‌భూల్‌పురా ప్రాంతంలో ఉన్న మదర్సాను, మసీదును కూల్చివేశారు. ఆక్రమణల తొలగింపు పేరుతో అధికారులు ఈ చర్యకు తెగబడ్డారు. ఈ కార్పొరేషన్‌ ప్రస్తుతం బిజెపి పాలనలో ఉంది. కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పలుచోట్ల అల్లర్లు చెలరేగాయని, రాళ్లు రువ్విన ఘటనలు జరిగాయని సామాజిక మాధ్యమాలలో వార్తలు వస్తున్నాయి. ఘర్షణల నేపథ్యంలో నగరంలో కర్ఫ్యూ విధించారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. హింసాకాండలో ఐదుగురు చనిపోయారని ఉత్తరాఖండ్‌ డిజిపి అభినవ్‌ కుమార్‌ తెలిపారు. మూడోరోజు కూడా ఉద్రిక్తతలు కొనసాగాయి.బన్‌భూల్‌పురాలోని కంపెనీ బాగ్‌ ప్రాంతంలో 2002లో మరియం మసీదును, అబ్దుల్‌ రజాక్‌ జకారియా మదర్సాను నిర్మించారు. ప్రస్తుతం అబ్దుల్‌ మాలిక్‌, ఆయన భార్య సఫియా మాలిక్‌ వీటి బాధ్యతలు చూస్తున్నారు. అయితే ప్రజావసరాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ భూమిలో మసీదును, మదర్సాను నిర్మించారని హల్ద్వానీ మున్సిపల్‌ కమిషనర్‌ పంకజ్‌ ఉపాధ్యారు చెబుతున్నారు. ఈ రెండింటినీ కూల్చివేయాలంటూ జనవరి 30న అబ్దుల్‌ మాలిక్‌కు నోటీసు జారీ చేశామని ఆయన చెప్పారు. అయితే దీనిపై సఫియా మాలిక్‌ ఈ నెల 6న ఉత్తరాఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. మసీదును, మదర్సాను 1937లో లీజుకు ఇచ్చారని, 1994లో తన కుటుంబానికి విక్రయించారని ఆమె వివరించారు. మత కట్టడాల కూల్చివేతలపై స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. మదర్సాను పేద ప్రజల కోసం నడుపుతున్నామని తెలిపారు. ఈ నెల 8న దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 14వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఆ రోజు ఇరు పక్షాలు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టు ఆదేశానికి ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ, అధికారులు వక్ర భాష్యం చెప్పారు. కూల్చివేతలపై కోర్టు స్టే ఇవ్వలేదని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలతోనే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్‌ అధికారులు తదుపరి విచారణ తేదీ వరకూ కూడా ఆగకుండా మసీదు, మదర్సాలను కూల్చివేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. కాగా కార్పొరేషన్‌ అధికారులు నిబంధనలు పాటించలేదని, నోటీసు ఇవ్వడం కానీ తమ వాదన విన్పించేందుకు సమయం ఇవ్వడం కానీ చేయలేదని మాలిక్‌ న్యాయవాది అV్‌ారV్‌ా చెప్పారు.

➡️