క్యూబా సోషలిజానికి 63 ఏళ్లు

Apr 18,2024 00:14 #Cuba, #Socialism

హవానా : ‘మనలో కొన ఊపిరి వున్నంతవరకూ మన జాతీయ పతాకాన్ని కాపాడుకుందాం’ పార్టీ కార్యకర్తగా మన మాతృభూమికి, విప్లవానికి అంకితమవుతూ, ప్రజల పట్ల నిబద్ధతతో వుందాం. నిజమైన క్యూబన్‌ విప్లవ వీరుల మనో నిశ్చయమిదేనని అంతర్జాతీయ యోధుడు, రిజర్వ్‌ కెప్టెన్‌ పాస్టర్‌ కాంటెరో ఎచాజబాల్‌ వ్యాఖ్యానించారు. క్యూబా విప్లవ లక్షణం సోషలిజమేనని ప్రకటించి 63 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి పోరాట యోధులను స్మరించుకుంటూ మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎచాజబాల్‌ మాట్లాడారు.
1961 ఏప్రిల్‌ 15న క్యూబా వైమానిక బలగాలపై అమెరికా జరిపిన దాడుల్లో మరణించిన వారి అంత్యక్రియల సందర్భంగా 16వ తేదీన హవానాలోని వదాడో జిల్లాలో జరిగిన కార్యక్రమంలో కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఫైడెల్‌ కాస్ట్రో రజ్‌ చెప్పిన మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తూనే వున్నాయి. ‘ఇలాంటి వీరులున్నందువల్లే లాటిన్‌ అమెరికా ప్రజలు స్వేచ్ఛగా వున్నారు, క్యూబా ప్రస్థానంలో ఇదొక ముఖ్యమైన రోజు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల కోసం ప్రజలు చేపట్టిన సామ్యవాద, ప్రజాస్వామ్య వివ్లవమిది అని వ్యాఖ్యానించారు.
దేశ అధ్యక్షులు, క్యూబా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ ఫస్ట్‌ కార్యదర్శి మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌, హవానా ప్రావిన్షియల్‌ కమిటీ ఫస్ట్‌ సెక్రటరీ లివాన్‌ ఇజెక్విర్డో అలోన్సో పాల్గొన్న ఈ సంస్మరణ కార్యక్రమంలో పాస్టర్‌ కాంటెరో మాట్లాడుతూ, దాడులు జరుగుతున్న ఆనాటి రోజుల్లో కష్టాలు, ఇబ్బందుల మధ్యనే ప్రజలు అత్యున్నత నైతిక విలువలతో ఎదిగారని కొనియాడారు.
హవానా పిసిసి ఫస్ట్‌ సెక్రటరీ అలోన్సో మాట్లాడుతూ, సామాజిక, ఆర్థికాంశాలకు సంబంధించి విప్లవం క్లిష్టమైన సమయాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో మనం ఈనాడు ఈ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అత్యంత పవిత్రమైన మన ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి క్రూరంగా, సాంప్రదాయేతర పద్దతుల్లో యుద్ధం జరుగుతోందన్నారు. చివరగా లాంగ్‌ లివ్‌ ఫ్రీ క్యూబా అంటూ క్యూబా అధ్యక్షుని నినాదాలతో సభ ముగిసింది.

➡️