పత్రికా స్వేచ్ఛ కోసం పోరాడిన యోధుడు డెలోయిర్‌ కన్నుమూత

Jun 10,2024 08:29 #Deloire, #passed away
  •  జర్నలిస్ట్స్‌ వితవుట్‌ బోర్డర్‌ నివాళి

పారిస్‌: పత్రికా స్వేచ్ఛ కోసం నిరంతరం పోరాడిన యోధుడు, జర్నలిస్ట్స్‌ వితవుట్‌ బోర్డర్‌ ఇంటర్నేషనల్‌ డైరక్టర్‌ జనరల్‌ క్రిస్టోఫ్‌ డెలోయిర్‌ శనివారం మరణించారు. ఆయన వయసు53 సంవత్సరాలు. గత కొంత కాలంగా కేన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఉన్నట్టుండి ఒక్కసారి ఆ మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో తనువు చాలించారు. ఆయనకు భార్య, కుమారుడు, తల్లి దండ్రులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పారిస్‌ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్స్‌ వితవుట్‌ బోర్డర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ డైరక్టర్లు, సిబ్బంది ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. 2012 నుంచి పన్నెండేళ్ల పాటు జర్నలిస్ట్స్‌ వితవుట్‌ బోర్డర్‌ ఇంటర్నేషనల్‌ డైరక్టర్‌ జనరల్‌గా, జర్నలిస్ట్స్‌ వితవుట్‌ బోర్డర్‌ సెక్రటరీ జనరల్‌గా పత్రికా స్వేచ్ఛను కాపాడడంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. ఉక్రెయిన్‌, టర్కీ, ఆఫ్రికా ఇలా ఏ దేశంలో జర్నలిస్టులు నిర్బంధానికి గురైనా వెంటనే అక్కడకు వెళ్లి ప్రభుత్వంతో చర్చించి వారిని విడిపించే దాకా విశ్రమించేవాడు కాదు. రెండేళ్ల క్రితం మాలిలో ఇస్లామిస్ట్‌ తీవ్రవాదుల చెర నుంచి జర్నలిస్టును విడుదలగావించడంలో డెలోయిర్‌ చూపిన చొరవ అమోఘం. జర్నలిజం స్వతంత్రతను, వైవిధ్యాన్ని కాపాడేందుకు అహరహం శ్రమించారు. జర్నలిజాన్ని జీవిత పోరాటంగా మలచుకున్నారు. జర్నలిజానికి పెద్ద ముప్పు రాజకీయ ఒత్తిళ్లేనని ఆయన అనేవారు. గత దశాబ్ద కాలంలో పత్రికా స్వేచ్ఛ సూచిలో భారత్‌ అథమ స్థానానికి పడిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

➡️