Video – న్యూయార్క్‌లో కార్చిచ్చు – ఆకాశాన్నంటిన దట్టమైన పొగ..!

న్యూయార్క్‌ : న్యూయార్క్‌లోని హాంప్టన్స్‌ సమీపంలో కార్చిచ్చు రాజుకుంది. తీవ్రమైన గాలుల కారణంగా ఆ ప్రాంతమంతా ఆకాశాన్నంటే దట్టమైన పొగ కమ్ముకుంది. గత శనివారం మాన్‌హట్టన్‌కు తూర్పున 80 మైళ్ల దూరంలో ఉన్న లాంగ్‌ ఐలాండ్‌లోని పైన్‌ బారెన్స్‌లో పెద్ద ఎత్తున కార్చిచ్చు చెలరేగింది. పైన్‌ బారెన్స్‌ అనేది సఫోల్క్‌ కౌంటీలోని 105,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అటవీ, రక్షిత ప్రాంతం. ఈ ప్రాంతంలో రేగిన కార్చిచ్చును అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి.

శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి మోరిచెస్‌, ఈస్ట్‌పోర్టు, వెస్ట్‌ హౌంప్టన్స్‌తో సహా పలు ప్రాంతాలకు కార్చిచ్చు విస్తరించింది. ఆ ప్రదేశాలన్నీ పొగతో నిండిపోయాయి. 3 చోట్ల మంటలను సిబ్బంది అదుపులోకి తెచ్చారు. హౌంప్టన్స్‌లో 50 శాతం అగ్నికీలలను ఆర్పేశారు. మరో చోట మంటలను ఆర్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈస్ట్‌పోర్ట్‌, వెస్ట్‌హాంప్టన్‌ చుట్టూ ఉన్న హైవే వద్ద ఏడు మైళ్ల విస్తీర్ణంలో ఈ కార్చిచ్చు చెలరేగి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. స్పష్టత రావల్సి ఉంది.

ఈ కార్చిచ్చు కారణంగా రెండు వాణిజ్య భవనాలు కాలిపోయాయి. అయితే, స్థానికంగా ఉన్న ఇండ్లకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారుల సమాచారం. మంటలను అదుపు చేసే క్రమంలో సిబ్బందిలో ఒకరి ముఖానికి కాలిన గాయాలుకాగా, వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఘటనా స్థలం వద్ద చర్యలు చేపట్టేందుకు … గవర్నర్‌ అత్యవసర నిర్వహణ, అగ్నిమాపక నివారణ, నియంత్రణ శాఖ, రవాణా శాఖ, పర్యావరణ పరిరక్షణ విభాగం, రాష్ట్ర ఉద్యానవనాలు, న్యూయార్క్‌ రాష్ట్ర పోలీసు కార్యాలయాల నుండి సిబ్బందిని నియమించారు.

డెమోక్రటిక్‌ గవర్నర్‌ కాథీ హౌచుల్‌ ఆ నగరంలో రాష్ట్ర విపత్తు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.. ఈ కార్చిచ్చు ఇంకా నియంత్రణలోకి రాలేదని, స్థానికులను ఆ ప్రాంతం నుంచి తరలిస్తున్నామని తెలిపారు. మంటలను అదుపుచేసేందుకు హెలికాప్టర్లతో నీటిని చల్లుతున్నట్లు వెల్లడించారు. పొగ కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ”ప్రజా భద్రత నా ప్రధాన ప్రాధాన్యత, లాంగ్‌ ఐలాండ్‌ వాసులను సురక్షితంగా ఉంచడానికి నేను చేయగలిగినదంతా చేయడానికి కట్టుబడి ఉన్నాను” అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు.

➡️