సానుకూల వాతావరణంలో ముగిసిన చర్చలు

  • వచ్చే వారం కొనసాగింపు
  • నిర్మాణాత్మక చర్చలని ఇరాన్‌ వ్యాఖ్య
  • స్పందించని అమెరికా

మస్కట్‌ : ఒమన్‌ రాజధాని మస్కట్‌లో శనివారం అమెరికా, ఇరాన్‌ మధ్య జరిగిన నిర్మాణాత్మకమైన చర్చలు ముగిశాయని ఇరాన్‌ పేర్కొంది. రెండున్నర గంటల పాటు ఈ పరోక్ష చర్చలు జరిగాయని, వచ్చే వారం కూడా ఈ చర్చలు కొనసాగించేందుకు ఉభయ పక్షాలు అంగీకరించాయని తెలిపింది. ఇరాన్‌ ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చి నేతృత్వం వహించగా, అమెరికా బృందానికి ప్రత్యేక దూత స్టీవ్‌ విట్‌కాఫ్‌ నాయకత్వం వహించారు. మస్కట్‌లో పరోక్ష చర్చలు ముగిసిన తర్వాత ఒమన్‌ విదేశాంగ మంత్రి సమక్షంలో ఈ ఇరువురు అధికారులు కొద్ది నిముషాల సేపు మాట్లాడుకున్నారని ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ చర్చల్లో అణు ఒప్పందం కుదుర్చుకోకపోతే మిలటరీ చర్య తప్పదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. తాము అణ్వాయుధాల కోరుకోవడం లేదని ఇరాన్‌ స్పష్టం చేసింది. తమపై అమలవుతున్న ఆంక్షలు ఎత్తివేయాలని మాత్రమే కోరుకుంటున్నామని తెలిపింది. అణు అంశంపైన మాత్రమే చర్చలు కేంద్రీకృతం కావాలని ఇరాన్‌ పట్టుబట్టింది. రక్షణ సామర్ధ్యాలపై ఎలాంటి చర్చలు జరిగే అవకాశాలు లేవని తోసిపుచ్చింది. చర్చల అనంతరం ఇరాన్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అణు అంశంపై, ఆంక్షల ఎత్తివేతపై అమెరికాతో చర్చలు ముగిశాయని పేర్కొంది. పరస్పర గౌరవం ప్రాతిపదికన నిర్మాణాత్మకమైన, సానుకూల వాతావరణంలో ఈ చర్చలు సాగాయని పేర్కొంది.

శనివారం నాటి చర్చలు స్నేహపూరితమైన వాతావరణంలో జరిగాయని ఒమన్‌ తెలిపింది. సక్రమ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఉద్దేశించి చర్చల ప్రక్రియను ప్రారంభించినందుకు ఇరాన్‌, అమెరికా అధికారులకు ఒమన్‌ విదేశాంగ మంత్రి బాదర్‌ అల్బూసైది కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవడానికి, అంతిమంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతలు, సుస్థిరతను సాధించేందుకు దారి తీయగల అనుకూలమైన స్నేహ వాతావరణం నెలకొందని మంత్రి పేర్కొన్నారు. ఒమన్‌లో చర్చలపై అమెరికా నుండి ఇంతవరకు ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు.

ఆర్థిక రాయితీలపైనే ఇరాన్‌ దృష్టి

ప్రస్తుతం తమపై అమలవుతున్న కఠినమైన ఆంక్షల నేపథ్యంలో కొన్ని ఆంక్షలనైనా ఎత్తివేస్తే తమకు ఆర్థిక అవకాశాలు వస్తాయని ఇరాన్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాతో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తోంది. ట్రంప్‌, ఆయన దూత విట్‌కాఫ్‌లు వ్యాపారవేత్తలు, పెట్టుబడుల అవకాశాల గురించి వారు ఆలోచిస్తూ వుంటారు, వాళ్ల గురించి తెలిసిన ఇరాన్‌ అధికారులు మాత్రం ఆ దిశగా సంకేతాలు పంపారు. ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థలో అమెరికా సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు తాము వ్యతిరేకం కాదని ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజెషికాన్‌, మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేనీ ఇప్పటికే ప్రకటించారు.

➡️