శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను ప్రైవేటీకరించం : దిసనాయకె

కొలంబో : నగదు సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ను విక్రయించాలని లేదా దాన్నుండి పెట్టుబడులను ఉపసంహరించాలని గత ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలను నూతన అధ్యక్షుడు దిసనాయకె నేతృత్వంలోని నేషనల్‌ పీపుల్స్‌ పవర్‌ (ఎన్‌పిపి) ప్రభుత్వం రద్దు చేయనుంది. పర్యాటకాభివృద్ధికి గల ప్రాధాన్యతను దృష్టిలో వుంచుకుని దేశ విమానయాన సంస్థను ప్రభుత్వంలోనే కొనసాగించాలని భావిస్తున్నట్లు ఎన్‌పిపి ఆర్థిక మండలి చైర్మన్‌ అనీల్‌ జయంత తెలిపారు. విమానయాన సంస్థను విక్రయించేది లేదని లేదా పెట్టుబడులు ఉపసంహరించేది లేదని స్పష్టం చేశారు. దానికి బదులుగా ఆ సంస్థ నిర్వహణను మెరుగుపరిచే కొత్త నమూనాను పరిశీలించనున్నట్లు చెప్పారు. తొలుత ప్రభుత్వ రంగంలో వున్న ఈ సంస్థ నుండి 51శాతం పెట్టుబడులను విక్రయించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు గానూ ఈ వైమానిక సంస్థకు గల 51 కోట్ల డాలర్ల రుణాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని గత కేబినెట్‌ నిర్ణయించింది.

➡️