ఫ్రెంచ్‌ పార్లమెంటు రద్దు

Jun 11,2024 08:09 #french, #Parlament
  • జూన్‌, జులైలో ఎన్నికలు : మాక్రాన్‌ ప్రకటన

పారిస్‌ : ఫ్రాన్స్‌ పార్లమెంట్‌ను రద్దు చేసి తిరిగి తాజాగా ఎన్నికలకు వెళ్తున్నట్లు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ సోమవారం ప్రకటించారు. ఇయు పార్లమెంటు ఎన్నికల్లో మారిన్‌ లీపెన్స్‌కి చెందిన మితవాద నేషనల్‌ ర్యాలీ (ఆర్‌ఎన్‌) పార్టీ చేతిలో మాక్రాన్‌ పార్టీ ఓటమి పాలవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం వచ్చిన యురోపియన్‌ పార్లమెంట్‌ ఫలితాలు తమ ప్రభుత్వానికి చాలా నిరాశపరిచాయని, వాటిని ఎంత మాత్రమూ నిర్లక్ష్యం చేయకూడదని తాము భావిస్తున్నట్లు చెప్పారు. జాతినుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, జూన్‌ 30న దిగువ సభ ఎన్నికలు జరుగుతాయని, జులై 7న రెండో రౌండ్‌ ఓటింగ్‌ జరుగుతుందని తెలిపారు. వివరణ ఇవ్వడానికి ఇది చాలా కీలకమైన సమయమని ఆయన వ్యాఖ్యానించారు. మీ ఆందోళనలన్నింటినీ విన్నాను, వాటిని సమాధానం చెప్పకుండా వదిలిపెట్టబోనని చెప్పారు. సామరస్యతతో వ్యవహరించడాలంటే ఫ్రాన్స్‌కు స్పష్టమైన మెజారిటీ అవసరమని అన్నారు. మితవాదపార్టీలు మొత్తంగా అన్ని చోట్లా ముందంజలో వుంటున్నాయని, ఈ పరిస్థితి కారణంగానే తాను రాజీనామా చేయడం లేదన్నారు. మొదటి ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం లీ పెన్స్‌ నేషనల్‌ ర్యాలీ పార్టీ 32శాతం ఓట్లను గెలుచుకుంది. సోషలిస్టులు 14శాతంతో వున్నారు. లీపెన్స్‌ బలంగా ఎదుగుతుండడం వల్ల అధికారంపై మాక్రాన్‌ పట్టు బలహీనమవుతుందని భావిస్తున్నారు. దిగ్భ్రాంతి కలిగించే రీతిలో మాక్రాన్‌ ప్రకటన వెలువడిన వెంటనే లీపెన్‌ మాట్లాడుతూ, రాబోయే జాతీయ ఎన్నికల్లో ప్రజలు తమపై విశ్వాసముంచితే తాము అధికారం చేపట్టడానికి సిద్ధంగా వున్నామని చెప్పారు.

➡️