నేపాల్ : నేపాల్ లో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం వచ్చిన ఈ భూకంపంలో ఇప్పటివరకు కనీసం 53 మంది మరణించినట్లు తెలుస్తోంది. చైనా అధికారిక మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. మరో 62 మంది గాయపడినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. కొన్ని క్షణాల పాటు ప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆరుసార్లు భూమి కంపించడంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందనే విషయంపై స్పష్టత రాలేదు. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93 కిలోమీటర్ల దూరంలోని లబుచె ప్రాంతంలో ఈరోజు ఉదయం 6.35 గంటలకు భూమి కంపించింది. టిబెట్‌లోని షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు. దీని తీవ్రతతో నేపాల్ రాజధాని కాట్మండులో సహా పలు జిల్లాల్లో భూమి కంపించింది. మరోవైపు …. ఉత్తరాదిని కూడా భూకంపం వణికించింది. బిహార్ రాజధాని పాట్నా సహా పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. అంతేకాకుండా పొరుగుదేశాలైన చైనా, భూటాన్, బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి.