- 188 మందికి గాయాలు
- యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలకు జిన్‌పింగ్ ఆదేశం
- నేపాల్, భారత్‌ల్లోనూ ప్రకంపనలు
ఖాట్మండు : నైరుతి చైనా అటానమస్ ప్రాంతమైన టిబెట్ జిజాంగ్‌లోని డింగ్రి కౌంటీలో మంగళవారం ఉదయం భారీ భూకంపంలో 126 మంది మరణించగా, మరో 188 మంది గాయపడ్డారు. భూ కంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8 పాయింట్లుగా నమోదయింది. భూ కంప నాభి పది కిలోమీటర్ల లోతున భూమిలో ఉన్నట్లు గుర్తించారు. భూ కంపం తరువాత ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి స్థాయిలో సహాయ పునరావాస చర్యలు చేపట్టాలని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ అధికారులను ఆదేశించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా జిన్‌పింగ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
నేపాల్ సరిహద్దుల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండులో భూ కంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదయింది. ఉదయం 9.05గంటల సమయంలో చైనాలోని టిబెట్ స్వయంప్రతిపత్తి ప్రాంతమైన జిగాజెలోని డింగ్రి కౌంటీ తీవ్రంగా కంపించింది. నేపాల్-టిబెట్ సరిహద్దుకు 93కిలోమీటర్ల దూరంలో లబుచె ప్రాంతంలో భూకంపం సంభవించింది. జిజాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతంలో లెవెల్ 2 ఎమర్జన్సీ హెచ్చరిక జారీ చేశారు. ఈ భూకంపం తర్వాత టిబెట్ ప్రాంతంలో మరో రెండు ప్రకంపనలు నమోదయ్యాయి. వాటి తీవ్రత 4.7, 4.9గా నమోదైంది. భూకంప కేంద్రం వున్న టిబెట్‌లో పలు భవనాలు నేలమట్టమయ్యాయి. శిధిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.
ఈ ప్రకంపనల ప్రభావం భారత్‌పైనా పడింది. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో భూమి కంపించింది. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, బీహార్ సహా పలు చోట్ల భూ ప్రకంపనల వార్తలు వెలువడ్డాయి. భూటాన్; బంగ్లాదేశ్‌ల్లో పలు ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
అవసరమైన సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ ఆదేశాలు జారీ చేశారు. భూకంప బాధితులకు పంపిణీ చేసేందుకు గానూ 22వేల విపత్తు సహాయక వస్తువులను పంపించారు. శిబిరాలు, కోట్లు, దుప్పట్లు, పరుపులు, ఇంకా ఇతరత్రా అవసరాలకు సంబంధించిన వస్తువులు అందులో వున్నాయి. జిగాజె ప్రాంతం భారత్ సరిహద్దుకు సమీపంలో వుంది. ఇది టిబెట్‌లోని పవిత్రమైన నగరాల్లో ఒకటిగా భావిస్తారు. దలైలామా తర్వాత స్థానంలోని పంచలామా సాంప్రదాయ స్థానం ఈ ప్రాంతం. డింగ్రీ కౌంటీలోని ట్సోగో టౌన్‌షిప్‌లో భూకంప కేంద్రం వుంది. 20కిలోమీటర్ల పరిధిలో 6900మంది ప్రజలు ఇక్కడ వున్నారు. ఈ ప్రాంతంలో 27 గ్రామాలు వున్నాయి.