బంగ్లాదేశ్‌లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలి

  • ముఖ్య సలహాదారుతో రాజకీయ పార్టీల ప్రతినిధుల చర్చలు

న్యూఢిల్లీ : బంగ్లాదేశ్‌లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలిందిగా పలు రాజకీయ పార్టీలు ముఖ్య సలహాదారు మహ్మద్‌ యూనస్‌ను కోరాయి. ముఖ్య సలహాదారుతో ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశమై తాజా పరిస్థితిపై చర్చించారు. దేశంపై జరుగుతున్న దురాక్రమణను ఏ రీతిన ఎదుర్కోవాలనే అంశంపై యూనస్‌ రాజకీయ పార్టీల నుండి సలహాలు, సూచనలు కోరారు. అగర్తలాలో బంగ్లాదేశ్‌ అసిస్టెంట్‌ హై కమిషన్‌ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో బంగ్లాదేశ్‌-భారత్‌ సంబంధాల తీరుతెన్నులను నిర్ణయించేందుకు అనుసరించే వ్యూహంపై రాజకీయ పార్టీల నుండి సూచనలు కోరేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

అయితే ఈ సమావేశానికి అవామీ లీగ్‌, దాని మిత్రపక్షాలు హాజరు కాలేదు. ఎన్నికల తేదీని ప్రకటిస్తే ప్రజల్లో ఒక రకమైన ఉత్సాహం తలెత్తుతుందని, ఆ ఉత్సాహం దేశానికి ఉపకరిస్తుందని అందుకే ఈ సమావేశం ప్రధాన ఎజెండా కానప్పటికీ దీనిపై చర్చించామని బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) స్థాయి సంఘం సభ్యుడు అమీర్‌ ఖుస్రూ చౌదరి తెలిపారు. యూనస్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంత విస్తృత స్థాయిలో రాజకీయ సమావేశం జరగడం ఇదే ప్రధమం. ఎన్నికలకు ముందుగా పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చేందుకు రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతానని యూనస్‌ హామీ ఇచ్చారు. అయితే భవిష్యత్‌ ఎన్నికల్లో అవామీ లీగ్‌, దాని మిత్రపక్షాలను చేర్చుకుంటారో లేదో స్పష్టత రాలేదు.

మైనారిటీల రక్షణలో యూనస్‌ ప్రభుత్వం విఫలం : హసీనా

హిందువులు సహా మైనారిటీలకు రక్షణ కల్పించడంలో యూనస్‌ ప్రభుత్వం విఫలమైందని బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా పేర్కొన్నారు. ఆగస్టులో ఉవ్వెత్తున ఎగసిపడిన నిరసనలకు భయపడి హసీనా దేశం వీడి భారత్‌కు ప్రత్యేక విమానంలో వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందిన సంగతి తెలిసిందే. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మొదటిసారి వర్చువల్‌గా ఆమె ప్రసంగించారు. 1975లో తమ తండ్రి షేక్‌ ముజిబుర్‌ రహ్మాన్‌ను హత్య చేసినట్లే తనను, తన సోదరి షేక్‌ రెహానాను హత్య చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని హసీనా పేర్కొన్నారు. యూనస్‌ది అధికార వ్యామోహం అని విమర్శించారు. బంగ్లాదేశ్‌లోని ప్రార్థనా స్థలాలపై దాడులను అరికట్టడంలో తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. బంగ్లాదేశ్‌ ప్రధానిగా చివరి రోజు అధికారిక నివాసంలో ఉండగా పెద్దసంఖ్యలో నిరసనకారులు చుట్టుముట్టారని చెప్పారు. ఆ సమయంలో తాను కాల్పులకు భద్రతా సిబ్బందిని ఆదేశించివుంటే చాలామంది మరణించి ఉండేవారని అన్నారు. ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే తాను 25 నుండి 30 నిమిషాల్లో ఢాకా నుండి బయలుదేరి భారత్‌కు వచ్చేశానని హసీనా తెలిపారు.

➡️