ఖాతాలను నిలిపివేయాలన్న కేంద్రం .. భావప్రకటన స్వేచ్ఛకు విఘాతమన్న ఎక్స్

Feb 22,2024 12:42 #elon musk, #freedom of expression

న్యూఢిల్లీ  :  రైతలు నిరసనకు సంబంధించి సోషల్‌ మీడియా ఎక్స్‌లో కొన్ని ఖాతాలను నిలిపివేయాలంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు బుధవారం ఆసంస్థ తెలిపింది. ప్రత్యేక ఖాతాల నుండి వచ్చే పోస్టులను కూడా నిలిపివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు ఎలన్‌ మస్క్‌కి చెందిన సంస్థ వెల్లడించింది. హోంవ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు రైతుల నిరసనలకు సంబంధం ఉన్న 177 ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఎలక్ట్రానిక్స్‌, ఐటి మంత్రిత్వ శాఖ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ చర్యలతో తమ సంస్థ ఏకీభవించదని, భావప్రకటనా స్వేచ్ఛ దృష్ట్యా పోస్ట్‌లను నిలిపివేయడం సరికాదని ఎలన్‌ మస్క్‌ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. కానీ భారత ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కొన్ని ఖాతాలను నిలిపివేసినట్లు తెలిపింది. ఎక్స్‌ ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి వుంది.

చట్టపరమైన పరిమితుల కారణంగా కేంద్రం ఆదేశాలను బహిర్గతం చేయలేకపోతున్నామని, అయితే పారదర్శకత కోసం వాటిని వెల్లడించడం అత్యవసరమని విశ్వసిస్తున్నామని పేర్కొంది. బహిర్గతం చేయకపోతే.. జవాబుదారీతనం లోపిస్తుందని, ఏకపక్ష నిర్ణయాలకు దారితీస్తుందని తెలిపింది. భారత ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ రిట్‌ అప్పీలు దాఖలు చేశామని, ప్రస్తుతం అది పెండింగ్‌లో ఉందని తెలిపింది. తమ చర్యల కారణంగా ప్రభావితమైన యూజర్లకు నోటీసులు కూడా ఇచ్చినట్లు పేర్కొంది.

2021 రైతుల ఆందోళన సమయంలోనూ కేంద్రం కొన్ని ఖాతాలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి యాజమాన్యం (ట్విటర్‌ యాజమాన్యం) కేంద్రం మార్గదర్శకాలను వ్యతిరేకించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు అని పేర్కొంది.

➡️