84 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌లో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవం

May 15,2024 22:51 #Communist Party, #Switzerland

జ్యూరిచ్‌ : 84 ఏళ్ల తర్వాత స్విట్జర్లాండ్‌లో మళ్లీ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. రివల్యూషనరీ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ స్విట్జర్లాండ్‌ (ఆర్‌కెపి) పేరుతో బెర్న్‌లోని బర్గ్‌డోర్ఫ్‌లో జరిగిన 342 మంది ప్రతినిధుల సమావేశంలో స్థాపించ బడింది. డెర్సు హేరి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సామ్రాజ్యవాద యుద్ధం, ద్రవ్యోల్బణం, వాతావరణ సంక్షోభం, పాలస్తీనా సమస్య ఈ సదస్సులో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. స్విస్‌ యూనివర్సిటీల్లో జరుగుతున్న పాలస్తీనా అనుకూల నిరసనలకు పూర్తి మద్దతు ఇవ్వాలని, నిరసనలను మరింత ఉదృతం చేయాలని ఆర్‌కెపి నిర్ణయించింది. పాలస్తీనాకు అనుకూలంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు మద్దతుగా నిలిచే లక్ష్యంతో పార్టీ తదుపరి సదస్సు జూన్‌ 10 నుంచి 15 వరకు జరగనుంది. కాగా, 1921లో స్విట్జర్లాండ్‌లో తొలిసారిగా కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఆ సమయంలో పార్టీలో దాదాపు 6 వేల మంది సభ్యులు ఉన్నారు. 1940లో స్విస్‌ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. ఈ నిషేధానికి వ్యతిరేకంగా పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, కోర్టు నిషేధాన్ని సమర్థించింది. భావజాలం కంటే హింసకు, విధ్వంసానికి ప్రాధాన్యమిచ్చే కార్యకలాపాలను పార్టీ చేస్తోందని కోర్టు తీర్పు పేర్కొంది.

➡️