ఇయు ఎన్నికల్లో ఓటమితో జర్మనీ ఛాన్సలర్‌పై పెరుగుతున్న ఒత్తిడి !

బెర్లిన్‌ : ఆదివారం జరిగిన యురోపియన్‌ యూనియన్‌ ఎన్నికల్లో ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలోని మూడు పార్టీలు ఘోరంగా ఓడిపోవడంతో జర్మన్‌ ఛాన్సలర్‌ ఓల్ఫ్‌ షుల్జుపై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ఇతర యూరోపియన్‌ దేశాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా మితవాద పార్టీల దూకుడు పెరిగింది.. షుల్జుకి చెందిన సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎస్‌డిపి)13.9శాతం ఓట్లు, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న గ్రీన్స్‌ పార్టీకి 11.9శాతం ఓట్లు వచ్చాయి గత సారి ఎన్నికల్లో వచ్చిన 20.5శాతం ఓట్లతో పోలిస్తే ఎస్‌డిపి గణనీయంగా ఓట్లు కోల్పోయింది. మరో వైపు కన్జర్వేటివ్‌ పార్టీలైన క్రిస్టియన్‌ డెమోక్రటిక్‌ యూనియన్‌ (సిడియు), క్రిస్టియన్‌ సోషల్‌ యూనియన్‌ (సిఎస్‌యు)లకు 30శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఈ యూనియన్‌ జర్మనీలో బలమైన పార్టీగా ముందుకొచ్చింది. దేశ ప్రయోజనాల రీత్యా తక్షణమే కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం వుందని సిడియు నేత ఫ్రెడరిక్‌ మెర్జ్‌ ప్రభుత్వాన్ని కోరారు. వచ్చే ఏడాది పార్లమెంట్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సంకీర్ణానికి ఇది చిట్టచివరి హెచ్చరిక అని వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వం కోల్పోయిందని సిఎస్‌యు నేత మార్కస్‌ సోడెర్‌ విమర్శించారు. షుల్జు అధికారాన్ని అంటిపెట్టుకుని కూర్చోకుండా ఫ్రాన్స్‌ నేత మాక్రాన్‌లా జాతీయ పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరిపించాలని ఆయన కోరారు.

➡️