Europe మోస్ట్‌ వాంటెడ్‌ పీపుల్‌ స్మగ్లర్‌ ‘ది స్కార్పియన్‌’ అరెస్ట్‌

May 14,2024 13:29

ఐరోపా : ఐరోపా, బ్రిటన్‌లోకి వేల సంఖ్యలో మనుషులను అక్రమ రవాణా చేసిన కింగ్‌పిన్‌ ‘ది స్కార్పియన్‌’ను ఎట్టకేలకు ఇరాక్‌లో యుకె పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బ్రిటన్‌కు చెందిన బిబిసి చేసిన ఇన్వెస్టిగేషన్‌లో అతడిని ఇరాక్‌లోని సులేమానియా సిటీలో గుర్తించారు. దీని ఆధారంగా యూకేకు చెందిన నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌ ప్రాంతంలో అతడిని అరెస్టు చేసింది. అతడి గ్యాంగ్‌ ఏకంగా 10 వేల మందిని అక్రమంగా ఇంగ్లిష్‌ ఛానెల్‌ దాటించి బ్రిటన్‌లోకి చేర్చి ఉంటుందని అంచనా. స్కార్పియన్‌ అసలు పేరు బర్జాన్‌ మాజిద్‌.

అన్న మొదలుపెట్టిన మానవ అక్రమ రవాణా….
వాస్తవానికి 2006లో మాజిద్‌ కూడా యుకె లోకి అక్రమంగానే ప్రవేశించాడు. అతడిని దాదాపు 11 ఏళ్లు జైల్లో ఉంచి చివరికి ఇరాక్‌లో వదిలేశారు. ఆ తర్వాత తన అన్న మొదలుపెట్టిన మానవ అక్రమ రవాణాను అతడు కొనసాగించాడు. మాజిద్‌పై బెల్జియం కోర్టులో కేసు ఉంది అయితే కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆ కేసులో ఇప్పటికే న్యాయస్థానం 10 ఏళ్ల జైలు శిక్ష, 9,6,800 యూరోల ఫైన్‌ను విధించింది. ముందుగా మాజిద్‌ను మొబైల్‌ నెంబర్‌ ఆధారంగా గుర్తించారు. పోలీసులు అక్రమ వలసదారులను అరెస్టు చేసిన సమయంలో వారి మొబైళ్లలో ఒక నెంబర్‌ తరచూ కనిపించేది. దానికి స్కార్పియన్‌ అని పేరు గానీ, బొమ్మ గాని గుర్తుగా పెట్టుకొని సేవ్‌ చేసేవారు.

రెండేళ్లుగా ఆ గ్యాంగ్‌లో 26మంది అరెస్ట్‌ …
కుర్దిస్థాన్‌లో ఇంట్లో మాజిద్‌ ఉండగా యుకె అధికారులు వెళ్లి అరెస్టు చేశారు. అతడిపై ఉన్న నేరాలను ముందుగా దర్యాప్తు చేస్తామని, ఆ తర్వాత ఐరోపా దేశాల్లో నిందితుడిని ప్రశ్నించేందుకు అధికారులకు అనుమతినిస్తామన్నారు. ఈ గ్యాంగ్‌ 2016-21 మధ్యలో భారీ స్థాయిలో మానవ అక్రమ రవాణాకు పాల్పడిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే గత రెండేళ్లుగా ఆ గ్యాంగ్‌కు చెందిన దాదాపు 26 మందిని అరెస్టు చేశారు.

➡️