కొలంబో : ఈ నెల 14న శ్రీలంక పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ జనరల్ సమన్ శ్రీ రత్ననాయకె తెలిపారు. దేశ 17వ పార్లమెంట్‌కు జరుగుతున్న ఈ ఎన్నికల బరిలో 8,800మందికి పైగా అభ్యర్ధులు వున్నారు. దేశవ్యాప్తంగా 13,141 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1,71,40,354మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 75వేల మందికి పైగా పోలీసు అధికారులు బందోబస్తు విధుల్లో వున్నారు. నేషనల్ పీపుల్స్ పవర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. అధ్యక్షుడు దిసనాయకె నేతృత్వంలో దేశ రాజకీయ భవిష్యత్‌ను నిర్దేశించి ఎన్నికలుగా భావిస్తున్నారు. 225మంది సభ్యులు గల పార్లమెంట్‌లో మెజారిటీకి 113 సీట్లు అవసరం. 196మందిని ఎలక్టోరల్ జిల్లాలో దామాషా ప్రాతినిధ్యం ద్వారా ఎన్నుకోగా, జాతీయ జాబితా ద్వారా 29మందిని నియమిస్తారు. కొలంబో జిల్లాలో అత్యధికంగా 996మంది అభ్యర్ధులు బరిలో వుండగా, పొలన్నరువా జిల్లాలో అత్యల్పంగా 120మంది అభ్యర్ధులు వున్నారని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.
