గాజాలో మితిమీరిన ఇజ్రాయిల్‌ పైశాచికం

– ఆహారం పంపిణీ చేస్తున్న సంస్థపైనా దాడులు
-వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌కు చెందిన ఏడుగురు మృతి
-తీవ్రంగా ఖండించిన అంతర్జాతీయ సమాజం
గాజా : ఇజ్రాయిల్‌ దురాగతాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తాజాగా గాజాలో ఆహార సరఫరాల పంపిణీ జరుపుతున్న వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ సిబ్బందిపై దాడులకు దిగింది. ఇజ్రాయిల్‌ మిలటరీ లక్ష్యిత దాడిలో తమ సిబ్బంది ఏడుగురు మరణించారని వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ ధృవీకరించింది. తక్షణమే గాజాలో విచక్షణారహితంగా జరుగుతున్న కాల్పులను ఆపాల్సిందిగా అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ సహాయ గ్రూపు కోరింది. మరణించిన వారిలో పాలస్తీనా, ఆస్ట్రేలియా, పోలెండ్‌, బ్రిటన్‌, అమెరికా-కెనడా పౌరుడు వున్నారు. కాగా, ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. నెతన్యాహూ యుద్ధోన్మాదం మితిమీరిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఆహారాన్ని అందకుండా చేయడాన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడం ఇజ్రాయిల్‌ దాష్టీకానికి అద్దం పడుతోందని పలువురు విమర్శించారు.
గాజాలో చోటు చేసుకున్న దాడి తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చైనా పేర్కొంది. గాజా ప్రజలకు అవసరమైన ఆహార సరఫరాలు అందించడానికి వచ్చిన బృందం ఇలా దారుణంగా దాడికి దిగి వారిని పొట్టనబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండించింది. పౌరులకు హాని చేకూర్చే, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే ఇలాంటి చర్యలన్నింటినీ చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొన్నారు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే ఇలాంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చైనా పేర్కొంది. ఇరాన్‌ ఎంబసీపై దాడిని ఖండించింది. ఇలాంటి దారుణాలను తాము ఎంతమాత్రమూ సహించబోమని రష్యా స్పష్టం చేసింది. ఇజ్రాయిల్‌ ఇలాంటి దారుణాలను తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేసింది.
హైతీలో ఘోరమైన భూకంపం సంభవించిన నేపథ్యంలో 2010లో సెలబ్రిటీ చెఫ్‌ జోస్‌ ఆండ్రెస్‌ ఈ వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ను ప్రారంభించారు. గాజాలో జరిగిన దారుణాన్ని చూసి తన హృదయం ద్రవించిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌ దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియచేశారు. మరణించిన వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌ సిబ్బంది మృత దేహాలను రాఫా క్రాసింగ్‌ ద్వారా తరలించడానికి ఏర్పాట్లు చేసినట్లు పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ తెలిపింది. తొలుత అల్‌ అక్సా ఆస్పత్రికి తరలించి, అక్కడ నుండి రాఫాలోని అల్‌ నాజర్‌ ఆస్పత్రికి తరలించనున్నారు. తాజా మరణాలతో గాజాలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 32,916కి చేరింది. 75,94మంది గాయపడ్డారు. కాగా గాజాలో ప్రజలకు ఎంతగానో అవసరమైన ఆహార సరఫరాలు అందనీయకుండా ఇజ్రాయిల్‌ ప్రతిచోటా ఆహార సరఫరాలపై ఆంక్షలు విధిస్తోందని సేవ్‌ ది చిల్డ్రన్‌ చారిటీ విమర్శించింది. ప్రాణాధారమైన ఆహారం, మందులు కూడా సకాలంలో అందనీయకుండా సుదీర్ఘ జాప్యం జరిగేలా చూస్తోందని ఒక ప్రకటనలో విమర్శించింది.
ఐరాస భద్రతా మండలి భేటీ
సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఇరాన్‌ ఎంబసీపై ఇజ్రాయిల్‌ దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమవనుంది. రష్యా అభ్యర్దన మేరకు భద్రతా మండలి సమావేశమై ఇజ్రాయిల్‌ దారుణాన్ని చర్చించనుంది. ఈ మేరకు రష్యా డిప్యూటీ రాయబారి దిమిత్రి పొలియెన్స్క్‌ ఒక ప్రకటన చేశారు. సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు సోమవారం దాడి చేసిన సంగతి విదితమే. ఈ దాడిలో సీనియర్‌ మిలటరీ కమాండర్లతో సహా తమ సైనిక సలహాదారులు ఏడుగురు సహా మొత్తంగా 13మంది మరణించారు.

➡️