గోమా : కాంగో సైన్యం, రువాండా మద్దతున్న ఎం23 తీవ్రవాదుల మధ్య భీకర యుద్ధం సాగుతోందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ పోరాటంలో కనీసం 700 మంది చనిపోగా మూడు వేల మంది వరకు గాయాలపాలయ్యారని పేర్కొంది. ఇప్పటికే గోమా నగరాన్ని, ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్న తీవ్రవాదులు దక్షిణాన ఉన్న కివు ప్రావిన్స్‌లోకి శరవేగంగా చొచ్చుకు వస్తున్నారని వెల్లడించింది. ఈ క్రమంలో జరుగుతున్న పోరులో భారీగా ప్రాణనష్టం సంభవించిందని వివరించింది. తీవ్రవాదులు మరో విమానాశ్రయాన్ని కూడా స్వాధీనం చేసుకునే ప్రమాదముందని హెచ్చరించింది. దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కొన్ని గ్రామాలను ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకున్నారని ఐరాస పేర్కొంది. గోమా తీవ్రవాదుల వశం కావడంతో విదేశీ సాయుధ ముఠాలు లొంగుబాట పట్టడం, పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోవడంతో కాంగో ఆర్మీ బలహీనపడిందని వివరించింది. కాంగోలోని సాయుధ గ్రూపుల్లో ఎం23యే అతిపెద్దది.
