విస్కాన్సిన్ (అమెరికా) : అగ్రరాజ్యం అమెరికాలోని మళ్లీ కాల్పుల మోత మోగింది. విస్కాన్సిన్‌లోని మాడిసన్‌లో ఉన్న అబండంట్ క్రైస్తవ పాఠశాలలో కాల్పులు జరిగాయి. 12వ తరగతి విద్యార్థి ఈ ఘటనకు కారణమైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. మరో ఐదుగురు గాయపడ్డారు. వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించారు. నిందితుడు సైతం మఅతుల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందినవారు విద్యార్థులా లేదా సిబ్బందా అనే విషయం తెలియాల్సి ఉంది. కాల్పులు ఘటనకు సంబంధించి దేశాధ్యక్షుడు బైడెన్‌కు అధికారులు సమాచారం అందించారు. 400 విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో కాల్పుల ఘటనతో ఒక్కసారిగా భయాందోళనలు చోటుచేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసులు వాహనాలు, అంబులెన్స్‌లు, ఫైరింజన్లు పాఠశాలను మోహరించాయి. ఘటనపై మాడిసన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజా ఘటనతో అగ్రరాజ్యంలో తుపాకీ నియంత్రణ, పాఠశాలల భద్రత యూఎస్‌లో ప్రధాన రాజకీయ, సామాజిక సమస్యగా మారింది. ఇటీవల కాలంలో అమెరికాలోని పాఠశాలల్లో కాల్పులు ఘటనలు పెరుగుతున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 322 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నట్లు ఓ నివేదిక తెలిపింది.
