లాభార్జన కోసమే

  • ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలకు ట్రంప్‌ మినహాయింపులపై ఆర్థిక సలహాదారు అక్షత్‌ శ్రీవాత్సవ

వాషింగ్టన్‌ : ప్రతి ఐఫోన్‌ అమ్మకం పైనా అమెరికాకు యాభై డాలర్ల లాభం వస్తుంది. అదే చైనాకు పది డాలర్లు మాత్రమే దక్కుతోంది. మిగిలిన 40 డాలర్లు ఇతర అంతర్జాతీయ సరఫరాదారుల ఖాతాల్లో చేరుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన 125 శాతం సుంకాల జాబితా నుండి స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాలను మినహాయించడానికి ఇదే ప్రధాన కారణమని విజ్‌డమ్‌ హచ్‌ వ్యవస్థాపకుడు, ఆర్థిక సలహాదారు అక్షత్‌ శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక పోస్ట్‌ పెట్టారు. ఇది రక్షణాత్మక చర్య కాదని, లాభాలను దృష్టిలో పెట్టుకొనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ‘ప్రతి వ్యక్తి సొంత లాభం కోసమే పనిచేస్తారు. దీనికి ఓ కారణం ఉంది. విజేత మాత్రం పెటుబడిదారీ విధానమే. ఆర్థిక స్వీయ ప్రయోజనాలను కాపాడుకోవడం ఈ యుగం మనుగడ యొక్క స్వభావంగా ఉంది’ అని వ్యాఖ్యానించారు. టారిఫ్‌లకు విరామం ప్రకటించడం వల్ల మార్కెట్లు శాంతిస్తాయని, ఈ నిర్ణయం స్వల్పకాలిక ర్యాలీకి ఆజ్యం పోస్తుందని శ్రీవాత్సవ తెలిపారు. ఒకే దేశంలో, ఒకే కరెన్సీలో వంద శాతం పెట్టుబడులు పెట్టడం విపత్తుకు సూచన అని ఆయన హెచ్చరించారు. అమెరికా ఈక్విటీలు, బంగారం, బిట్‌కాయిన్‌, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు, రియల్‌ ఎస్టేట్‌ వంటి రంగాలతోపాటు చైనాకు కూడా పెట్టుబడులు మళ్లించాలని సూచించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందన్న భయాందోళనలను ఆయన తోసిపుచ్చారు. ‘అమెరికా డాలర్‌ బలం తగ్గినప్పటికీ అది మరిన్ని డాలర్లను ముద్రించి ఆ ద్రవ్యోల్బణాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయగలదు’ అని అన్నారు.

త్వరలోనే యూనిట్లు ప్రారంభం : అమెరికా

సుంకాలలో ప్రకటించిన మినహాయింపులను బట్టి అమెరికా మెతక వైఖరిని అవలంబిస్తోందని భావించరాదని శ్వేతసౌధం డిప్యూటీ ప్రెస్‌ సెక్రటరీ కుష్‌ దేశారు హెచ్చరించారు. కీలకమైన సెమీ కండక్టర్లు, చిప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి విషయంలో చైనాపై ఆధారపడబోమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయా ఉత్పత్తులను తయారుచేసే కంపెనీలు త్వరలోనే అమెరికాలో యూనిట్లను ప్రారంభించాలని భావిస్తున్నాయని దేశారు చెప్పారు.

➡️