- 1న కొత్త ప్రధానిగా ప్రకటన
టోక్యో :మాజీ రక్షణ మంత్రి షిగెరు ఇషిబా జపాన్ కొత్త ప్రధాని కానున్నారు. శుక్రవారం జరిగిన పాలక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఆర్థిక మంత్రి సానా తకైచిపై గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన అక్టోబర్ 1న ప్రధాని పదవిని చేపట్టనున్నారు. ఎల్‌డిపి ఎంపీలు, సభ్యులు వేసిన 409 ఓట్లలో ఇషిబాకు 215 వచ్చాయి. తకైచికి 194 లభించాయి. రక్షణ, వ్యవసాయం, ప్రాంతీయ పునరుజ్జీవనం వంటి రంగాలకు సంబంధించి విధానాల రూపకల్పనలో ఆయనకు నైపుణ్యం వుంది. వచ్చే మంగళవారం ఇషిబాను పార్లమెంట్‌లో ప్రధానిగా ప్రకటిస్తారు. ఫ్యుమియో కిషిదా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. ఇక ఆ తర్వాత ఆయన ప్రతినిధుల సభను రద్దు చేసి ఎన్నికలకు ఎప్పుడు పిలుపిస్తారో చూడాల్సి వుంది. పార్టీ ప్రధాన కార్యాలయం నుండి బయటకు వస్తూ ఇషిబా ఎల్‌డిపి సభ్యులందరూ సమైక్యంగా వుండాలని కోరారు. ఎన్నడూ లేని రీతిలో ఈసారి 9మంది ఈ పదవికి పోటీ పడ్డారు. జపాన్‌ను సురక్షితమైన దేశంగా నిలిపేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీని పునర్వ్యవస్థీకరించడం ఇషిబా ముందున్న పెద్ద సవాలుగా వుంది. ఆర్థిక సవాలు కూడా తీవ్రమైన పరీక్షగా మారనుంది.