న్యూఢిల్లీ/ఢాకా : బంగ్లాదేశ్ బహిష్కృత ప్రధాని షేక్ హసీనా శనివారం తమ పార్టీ అవామీ లీగ్ పార్టీ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఆడియో వాయిస్‌ను విడుదల చేశారు. గతేడాది ఆగస్టులో దేశాన్ని విడిచి పారిపోతున్న సమయంలో తాను, తన సోదరి ప్రాణాపాయం నుండి ఎలా తప్పించుకున్నారో వివరించారు. రాజకీయ ప్రత్యర్థులు తనను చంపడానికి యత్నించారని, తమని రక్షించిన అల్లాకు కృతజ్ఞతలు తెలియజేయడం ఆ ఆడియోలో వినిపిస్తోంది.
గతేడాది ఆగస్టులో అవామీ లీగ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న షేకహేసీనా తన పదవికి రాజీనామా చేసి, అధికారిక భవనం నుండి పారిపోయారు. ఆ సమయంలోనే తమపై హత్యాయత్నం జరిగిందని, తాను తన సోదరి 20-25 నిమిషాల వ్యవధిలో మృత్యువు నుండి తప్పించుకున్నామని ఆ ఆడియోలో తెలిపారు. అప్పటి నుండి వారు భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.
2004 ఆగస్టు 21న గ్రేనేడ్ దాడి జరిగిందని, గాయాలతో తప్పించుకున్నానని అన్నారు. అయితే ఆ దాడిలో 24 మంది మరణించారని అన్నారు. మరో 500 మందికి గాయాలు కాగా, హసీనా స్వల్పగాయాలతో బయటపడ్డారు. అంతకు ముందు 2000 కొటలీపర బాంబు దాడి గురించి వివరించారు. 2000లో గోపాల్ గంజ్ జిల్లాలో కొటలీపర ఎన్నికల ర్యాలీకి వెళ్లిన హసీనాపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. హసీనా సందర్శించాల్సిన కళాశాలలో బాంబులను గుర్తించిన బాంబ్ స్క్వాడ్ వాటిని తొలగించడంతో దాడి నుండి బయటపడ్డారు. తన ప్రత్యర్థులు తనను చంపేందుకు ఎలా కుట్ర పన్నారో ప్రపంచమంతా చూసిందని భావోద్వేగానికి గురయ్యారు. అయితే ప్రస్తుతం తాను ప్రాణాలతో ఉన్నప్పటికీ తన దేశం, ఇంటికి దూరమయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యర్థుల దాడిలో తన నివాసంలోని ప్రతి వస్తువు కాలిపోయిందని అన్నారు.