రోమ్ : హమాస్, హిజ్బుల్లా, హౌతీల నేతలను దారుణంగా హత్య చేసిన ఇజ్రాయిల్‌కు ఇరాన్ నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో జి-7 కూటమిలో కలవరం మొదలైంది. తాజా పరిణామాలపై చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ఈ ధనిక దేశాల కూటమిలో భాగస్వామి అయిన ఇటలీ కోరింది. పచ్చి మితవాది, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇజ్రాయిల్, లెబనాన్ సరిహద్దుల్లో శాంతి, భద్రతలను కాపాడేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని బలగాలను రంగంలోకి దించాలని ఆమె కోరారు. లెబనాన్‌లో ఇజ్రాయిల్ మిలటరీ ఆపరేషన్‌కు తక్షణమే స్వస్తి పలకాలని ఈ కూటమికే చెందిన ఫ్రాన్స్ కోరింది. 1701వ నెంబర్ ఐరాస తీర్మానానికి అనుగుణంగా లెబనాన్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కోరారు. త్వరలోనే లెబనాన్ ప్రజల కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.