గాజాకు విద్యుత్‌ కట్‌

Mar 11,2025 00:05 #power cut, #Power cut to Gaza
  • ఇజ్రాయిల్‌ దుశ్చర్య
  • ఉప్పునీటిని మంచినీటిగా మార్చే ప్లాంట్‌కు ఆగిన విద్యుత్‌
  • పాలస్తీనా వాసులకు తాగునీటి కష్టాలు

గాజా : కతార్‌లో కాల్పుల విరమణ రెండో దశ ఒప్పందంపై చర్చలు జరగడానికి ముందుగా గాజాకు ఇజ్రాయిల్‌ విద్యుత్‌ను నిలిపివేసింది. హమాస్‌ ఈ చర్యను తీవ్రంగా ఖండించింది. సెంట్రల్‌, దక్షిణ గాజా ప్రాంతాల్లోని ప్రజలకు తాగు నీరు అందజేసే, కీలకమైన ఉప్పునీటిని మంచినీరుగా మార్చే ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడాన్ని అమానవీయమైన చర్యగా హమాస్‌ పేర్కొంది. పాలస్తీనియన్లను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఇటువంటి చవకబారు, ఆమోదయోగ్యం కాని ఎత్తుగడలను ఉపయోగించడాన్ని ఖండించింది. పాలస్తీనియన్ల జాతిని నిర్మూలించే దురుద్ధేశంతోనే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని పాలస్తీనా అథారిటీ విమర్శించింది. గాజాలో మానవతా విపత్తును సృష్టించాలన్న కుట్రలో భాగంగానే ఈ చర్యలన్నీ అమలు చేస్తున్నారని పాలస్తీనా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి కూడా తాజా పరిణామాలను ఖండించారు. ఇజ్రాయిల్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని, నీరు, విద్యుత్‌లను వారికి అందకుండా చేయాలని చూస్తోందని హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ విమర్శించింది.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఈజిప్ట్‌, కతార్‌, అమెరికా మధ్యవర్తులుగా దోహాలో చర్చలు ప్రారంభం కావాల్సి వున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాజాకు వెంటనే విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాల్సిందిగా బ్రిటన్‌, ఇజ్రాయిల్‌ను కోరింది. తాజా వార్తల పట్ల బ్రిటన్‌ ప్రధాని కెయిర్‌ స్టార్మర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని ఆయన తరపు అధికార ప్రతినిధి తెలిపారు. గాజా ప్రజలకు అవసరమైన నిత్యావసరాలు అందకుండా చేయడమనేది అంతర్జాతీయ మానవతా చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని చెప్పారు.

పాలస్తీనా విద్యార్థి నేత అరెస్టు

విద్యార్ధుల కార్యకలాపాల పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పాలస్తీని విద్యార్ది నేత మహ్మద్‌ ఖలీల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అమెరికా హోమ్‌ల్యాండ్‌ భద్రతా విభాగానికి చెందిన ఏజెంట్లు పాలస్తీనా కార్యకర్త, కొలంబియా యూనివర్శిటీ మాజీ విద్యార్ధి మహ్మద్‌ ఖలీల్‌ను శనివారం అరెస్టు చేశారు. న్యూయార్క్‌ నగరంలోని ఆయన నివాసంలోనే ఈ అరెస్టు జరిగింది. కొలంబియా యూనివర్శిటీలో పాలస్తీనా సంఘీభావ ఉద్యమ కార్యకలాపాల్లో ఖలీల్‌ క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసిఇ)లో ఖలీల్‌ను నిర్బంధంలో వుంచారు. అక్కడ నుండి బహుశా ఆయనను తరలించే అవకాశం వుంది. గర్భవతి అయిన ఆయన భార్య చూసేందుకు వెళ్లగా అక్కడ లేరని, ఆయన ఆచూకీ గురించి కూడా వివరాలు తెలియజేయలేదని ఆయన తరపు న్యాయవాది అమీ గ్రీర్‌ చెప్పారు.

➡️