ఆహారం, నీరు లేకుండా లక్షలాదిమంది చిన్నారులు
గాజా : ఉత్తర గాజాను ఇజ్రాయిల్‌సైన్యం గత 50రోజులుగా నిర్బంధించింది. అక్టోబరు 6న మొదలైన ఈ దిగ్బంధనం, దాడులతో అక్కడ గల ప్రజలకు ఆహారం, నీరు, వైద్య సాయం అందడం లేదు. సహాయక సిబ్బందితో సహా ఎవరికీ ఈ ప్రాంతంలోకి వెళ్లడానికి కుదరడం లేదు. కరువు నెలకొనే పరిస్థితి వుందని హెచ్చరికలు జారీ చేసినా సరఫరాలను లోపలకు పంపడానికి సైన్యం అనుమతించడం లేదు. దాదాపు 1,30,000మంది చిన్నారులు ఈ ప్రాంతంలో చిక్కుకున్నారని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ అంచనా వేస్తోంది. ఆ ఏరియా అంతా మిలటరీ జోన్‌గా ఇజ్రాయిల్ రక్షణ బలగాలు ప్రకటించాయి. కనీస మానవత్వం చూపకుండా వ్యవహరిస్తున్నారంటూ ఐక్యరాజ్య సమితి విమర్శించినా ఇజ్రాయిల్ పట్టించుకోవడం లేదు. ఉత్తర గాజా గవర్నరేట్ ఏరియా మొత్తం ముప్పు ముంగిట వుందని ఐక్యరాజ్య సమితి ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఏ సహాయ గ్రూపులను సైన్యం లోపలకు అనుమతించడం లేదు.
సేవ్ ది చిల్డ్రన్‌కి చెందిన సంస్థలో పనిచేస్తున్న ఒక మహిళ తన భయానక అనుభవాన్ని వెల్లడిస్తూ, నిరంతరం బాంబు మోతలతో దద్దరిల్లుతున్న ఈ ప్రాంతంలో పిల్లలతో సహా చిక్కుకుపోయామని, ఎక్కడికైనా పారిపోయేందుకు కూడా వీల్లేకుండా వుందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబం మొత్తంగా చిన్నాభిన్నమైపోయిందన్నారు. ఆహారం లేదు, పరిశుభ్రమైన నీరు లేదు, నిరంతరంగా భయాందోళనల కారణంగా తన పిల్లలకు మానసిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, శరీరంపై దద్దుర్లు వచ్చి, నెత్తురోడుతున్నారని ఆమె వాపోయారు. అయినా మందులు లేవు, సాయం లేదని చెప్పారు. 5వేల కుటుంబాలకు సరిపడా ఆహార కిట్‌లు, గత ఏడు వారాలుగా ఈ ఏరియాకు బయటే పడి వున్నాయని ఆమె చెప్పారు. చిన్నారుల ఆహారం కొరత చాలా తీవ్రంగా వుందన్నారు. అంతర్జాతీయ సమాజం చేసే విజ్ఞప్తులన పెడ చెవిన పెట్టిన ఇజ్రాయిల్‌చిన్నారుల విషయంలో అమానుషంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.