గాజాస్ట్రిప్ : గాజాస్ట్రిప్‌పై గత తొమ్మిది నెలలుగా ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేధంలో 21,000 మంది చిన్నారులు అదృశ్యమయ్యారు. జాబితాలో లేదా శరణార్థి శిబిరాల్లో కనిపించని పిల్లలు సుమారు 21,000 మంది ఉండవచ్చని గాజా పాలనా యంత్రాంగం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. వీరిలో అత్యధికులు మరణించి ఉంటారని అంచనావేసింది.
గాజా అంతటా కూలిపోయిన భవనాల కింద వేలాది మృతదేహాలు చిక్కుకుని ఉండవచ్చని, శిథిలాల్లో సమాధి కావచ్చని, పేలుడు పదర్థాలతో వారికి హాని జరిగివుండవచ్చని, ఇజ్రాయిల్ బలగాలు నిర్భంధించి ఉండవచ్చని తెలిపింది. గాజాలోని ప్రస్తుత పరిస్థితుల్లో వారి సమాచారం సేకరించడం సాధ్యం కాదని వెల్లడించింది. 17,000 మంది చిన్నారులు తల్లిదండ్రుల నుండి వేరయ్యారని, సుమారు 4,000 మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని పర్కొంది.
అక్టోబర్ 7 నుండి ఇజ్రాయిల్ 14,000 మందికి పైగా చిన్నారులను హత్య చేసిందని ఐరాస చిన్నారుల నిధి (యునిసెఫ్) ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. మిగిలిన వారు పౌష్టికాహార లోపం, కనీసం ఏడ్చేందుకు కూడా శక్తిలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. గాజాలో చిన్నారులు అదృశ్యమయ్యేందుకు దారితీసిన పరిస్థితులు, జవాబుదారీ కోసం స్వతంత్య్ర దర్యాప్తు చేపట్టాలని మధ్య ఆసియాకి చెందిన ‘సేవ్ ది చిల్డ్రన్’ ప్రాంతీయ డైరెక్టర్ జెరెమి స్టోనర్ పేర్కొన్నారు.
ఖాన్ యూనిస్‌లో కాల్పులు : ఎనిమిది మంది మృతి
ఖాన్ యూనిస్‌లోని బనీ సుహేలా పట్టణంలో నిత్యావసర సరుకుల ట్రక్కుల్లోని ఆహారం కోసం ఎదురుచూస్తున్న ప్రజలపై ఇజ్రాయెల్ దళాలు కాల్పులు జరపడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో గాజా ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ డైరెక్టర్ హనీ అల్ – జాఫర్వి కూడా ఉన్నారు. గాజాకు ఎలాంటి సహాయం అందడం లేదని ఇయు విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ చెప్పారు. ఇప్పటివరకు ఇజ్రాయిల్ దాడుల్లో 37,626 మంది మరణించగా, 86,098 మంది గాయపడిన సంగతి తెలిసిందే.
