మానవాళి అభివృద్ధి కోసం మహత్తర విజయాలు

  • చైనా జాతీయ దినోత్సవం సందర్భంగా జిన్‌పింగ్‌ పిలుపు

బీజింగ్‌ : మానవాళి శాంతి, అభివృద్ధి కోసం మరిన్ని మహత్తర విజయాలు సాధించాలని, మరింత గొప్పగా సేవలందించాలని చైనా అధ్యక్షులు జీ జిన్‌పింగ్‌ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ చైర్మన్‌ కూడా అయిన జిన్‌పింగ్‌ దేశ 75వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా గ్రేట్‌ హాల్‌ ఆఫ్‌ ది పీపుల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. మంగళవారం చైనా జాతీయ దినోత్సవం. ఈ కార్యక్రమానికి 3వేల మందికి పైగా దేశ, విదేశీ ఆతిథులు హాజరయ్యారు. తొలుత అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశవ్యాప్తంగా ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తరలివచ్చిన వివిధ తరగతుల ప్రజలకు, సైనికులకు, సైనికాధికారులకు అభినందనలు తెలిపారు. హాంకాంగ్‌, మకావు ప్రత్యేక పాలనా ప్రాంతాల ప్రజలకు, ప్రవాసీ చైనీయులకు కూడా ఆయన శుభాభినందనలు తెలియజేశారు. దేశాభివృద్ధికి అన్ని వేళలా మద్దతునిస్తున్న మిత్ర దేశాలకు, అంతర్జాతీయ మిత్రులకు కృతజ్ఞతలు తెలియచేశారు. చైనాను బలమైన దేశంగా తీర్చి దిద్దుతూ, చైనా ఆధునీకరణ క్రమాన్ని అనుసరించడం ద్వారా అన్ని రంగాల్లో జాతీయ పునరుజ్జీవనాన్ని సాధించాలన్నదే ఈ కొత్త శకంలో సాగించే కొత్త ప్రయాణమని జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. మహత్తరమైన ఈ ప్రయాణాన్ని నిలకడగా ముందుకు తీసుకుని పోవడమే దేశ వ్యవస్థాపక దినోత్సవానికి మనమందించే సరైన నివాళి అవుతుందని అన్నారు. ఒక దేశం రెండు వ్యవస్థలు విధానాన్ని సంపూర్ణంగా, నమ్మకంగా, కృత నిశ్చయంతో అమలు చేయాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. చైనా లక్షణాలతోకూడిన సోషలిజం పంథాను అనుసరించాలని, అన్ని రంగాల్లో సంస్కరణలు మరింతగా తీసుకురావాలని , శాంతియుత అభివృద్దికి కట్టుబడి వుండాలని పిలుపునిచ్చారు.

➡️