హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా హత్య

  • బీరుట్‌పై ఇజ్రాయిల్‌ పాశవిక దాడులు

బీరుట్‌ : ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు లెబనాన్‌ రాజధాని బీరుట్‌లోని రద్దీగా ఉండే ప్రాంతాలపై పెద్దయెత్తున దాడులు చేసి హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లాతో సహా పలువురిని హత్యచేసింది. భారీగా విధ్వంసం సృష్టించింది. వరుస పేలుళ్లు బీరుట్‌ దక్షిణ శివారు ప్రాంతాలను కదిలించేశాయి. ఎప్పుడూ జనంతో రద్దీగా ఉండే దహీయేV్‌ా ప్రాంతం దట్టమైన పొగలతో కమ్మేసింది. అలాగే తూర్పు లెబనాన్‌లోని బెకా ప్రాంతంలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో ఆ సంస్థ చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లాతో సహా పలువురు చనిపోయారు. హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంతో బాటు ఆ చుట్టు పక్కల పలు నివాస భవనాలు ఈ దాడుల్లో నేలమట్టమయ్యాయి. దాడి జరిగిన ప్రదేశంలో పెద్ద బిలం ఏర్పడింది. లెబనాన్‌ తాత్కాలిక ప్రధాని నజీబ్‌ మికాట్‌ మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌ అనాగరిక దాడులతో కాల్పుల విరమణ యత్నాలకు నిలువునా తూట్లు పొడిచిందని విమర్శించారు. నస్రల్లా చనిపోయిన విషయాన్ని హిజ్బుల్లా ధ్రువీకరించినట్లు మీడియా తెలిపింది. నస్రల్లా హత్యతో తమ లక్ష్యం నెరవేరిందని ఇజ్రాయిల్‌ సైన్యం వెల్లడించింది.
గత రాత్రి నుండి అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతున్న దాడులతో, మోగుతున్న సైరన్లతో, విమానాల రొదతో ప్రజలకు కంటి
మీద కునుకు లేకుండా పోయింది. గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా ఈ దాడులు కొనసాగాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు బీరుట్‌ సముద్రపు ఒడ్డు దగ్గరకు చేరుకుంటున్నారు. శనివారం ఉదయం బీచ్‌కు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో కార్లు పార్క్‌ చేసుకుని కుటుంబాలతో రోడ్లపైనే కూర్చుని వుండడం కనిపిస్తోంది.

లెబనాన్‌కు అండగా వుంటాం: ఇరాన్‌ నేత ఖమేని
హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా హత్య నేపథ్యంలో లెబనాన్‌కు అండగా ఉంటామని ఇరాన్‌ ప్రకటించింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేని ఒక ప్రకటన చేస్తూ ఈ విషాద సమయంలో లెబనాన్‌ ప్రజలకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత భవితవ్యాన్ని నిర్ణయించేది ప్రతిఘటనా శక్తులేనని, అందులో హిజ్బుల్లా అగ్ర భాగాన వుంటుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌ విధానాన్ని ఖమేని తీవ్రంగా ఖండించారు. తదుపరి కార్యాచరణపై చర్చించి, నిర్ణయించేందుకు ఇతర ప్రాంతీయ గ్రూపులతో, హిజ్బుల్లాతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. శనివారం ఉదయం నుండి హిజ్బుల్లా రెండు డజన్లకు పైగా క్షిపణులను ఇజ్రాయిల్‌పై ప్రయోగించింది.

పోరు కొనసాగుతుందన్న హిజ్బుల్లా
తమ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన నస్రల్లాను హత్య చేసిన శత్రువుపై పోరాటం కొనసాగుతుందని హిజ్బుల్లా ప్రకటించింది. పాలస్తీనాకు మద్దతు కొనసాగుతుందని తెలిపింది.

ప్రతిఘటన బలపడుతుంది
నస్రల్లా మృతికి పాలస్తీనా గ్రూపు హమాస్‌ సంతాపం ప్రకటించింది. ”పోరు బాటలో వున్న నేతలు అమరులైనప్పుడు ఆ ప్రతిఘటనా క్రమం ఆదే బాటలో సాగి విజయం సాధిస్తుందని చరిత్ర మనకు రుజువు చేసింది. తర్వాత తరం నేతలు మరింత బలోపేతులై, మరింత కృతనిశ్చయం,, దీక్షతో ఈ పోరును కొనసాగిస్తారు.” అని హమాస్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రత్యేకంగా నస్రల్లా పేరును ప్రస్తావించకుండా శుక్రవారం నాటి దాడుల్లో మరణించిన వారికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ సంతాపం తెలిపారు. ఆ దాడులను తీవ్రంగా ఖండించారు.

హిజ్బుల్లా కొత్త నేత హషెమ్‌ సఫిద్దీన్‌?
నస్రల్లా హత్యతో హిజ్బుల్లా చీఫ్‌ బాధ్యతలు మత పండితుడు, రాజకీయ ప్రముఖుడు అయిన హషెమ్‌ సఫిద్దీన్‌ చేపట్టే అవకాశమున్నట్లు వార్తలొస్తున్నాయి.

➡️