- అందుబాటుల్లో లేని చికిత్సలు, ముందస్తు నివారణ చర్యలు
- యునిసెఫ్ నివేదిక వెల్లడి
న్యూయార్క్ : యువతులు, బాలికల్లో గతేడాది అత్యధికంగా హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్లు సోకడం పట్ల ఐక్యరాజ్య సమితి బాలల నిధి (యునిసెఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. వారికి చికిత్స అందుబాటులో వుండడం లేదని, పైగా ఈ ఇన్షెక్షన్లు సోకకుండా ముందస్తు నివారణ చర్యలు కూడా లేవని హెచ్చరించింది. డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం యునిసెఫ్ ఒక నివేదికను విడుదల చేసింది. 2023లో 15 నుండి 19ఏళ్ళ లోపు వయస్సు గల వారిలో 96 వేల మంది బాలికలకు, 41 వేల మంది బాలురకు హెచ్‌ఐవి సోకిందని ఆ నివేదిక పేర్కొంది. అంటే యుక్త వయస్సుకు వచ్చిన బాలికల్లో ప్రతి 10 మందిలో ఏడుగురు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని ఆందోళన వెలిబుచ్చింది. సబ్ సహారా ఆఫ్రికా ప్రాంతంలో, ఈ సంఖ్య ప్రతి పది మందిలో 9గా వుంది. 2023లో దాదాపు 13 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడ్డారని యుఎన్‌ఎయిడ్స్ సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. వారిలో ఎయిడ్స్ కారణాలతో 6.3 లక్షల మంది మరణించారని తెలిపింది. 2030 కల్లా ప్రజారోగ్యానికి ముప్పుగా వున్న ఎయిడ్స్‌ను నిర్మూలించాలన్న ఐక్యరాజ్య సమితి లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన దాని కన్నా మూడు రెట్లు ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడ్డారని యునిసెఫ్ అసోసియేట్ డైరెక్టర్ అనురిత బెయిన్స్ తెలిపారు.
సాధించాల్సిన లక్ష్యాలు మిగిలేవున్నాయి ..
కొత్త హెచ్‌ఐవి ఇన్ఫెక్షన్లను, ఎయిడ్స్ సంబంధిత మరణాలను తగ్గించడంలో భారత్ కొంత మేరకు పురోగతి సాధించినా సాధించాల్సింది ఇంకా చాలా ఉందని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. పురోగతి కనిపిస్తున్నప్పటికీ నిధులు, విరాళాలు తగ్గుతున్నందున ఈ కృషిని నిలకడగా కొనసాగించడానికి అవరోధాలు ఎదురవుతున్నాయని పేర్కొంది.