- కరువు కాటకాలూ యుద్ధ సాధనమే
- ఇజ్రాయిల్ దారుణాలపై మానవ హక్కుల సంస్థ
గాజా, బీరుట్ : గాజాపై ఇజ్రాయిల్ యుద్ధ నేరాలకు పాల్పడిందని మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థ (హ్యూమన్ రైట్స్ వాచ్) గురువారం ఒక నివేదికలో పేర్కొంది. గాజా నుండి పాలస్తీనియన్లను బలవంతంగా ఖాళీ చేయించి వారిపై దాడులకు, ఊచకోతకు దిగడమంటే అవి యుద్ధ నేరాలేనని స్పష్టం చేసింది. ఇజ్రాయిల్ ఆర్మీ దిగ్బంధనంలో వున్న గాజాలో అత్యంత దయనీయంగా వున్న మానవతా పరిస్థితులపై హెచ్చరిస్తూ సహాయక బృందాలు, అంతర్జాతీయ సంస్థలు వరుసగా జారీ చేస్తున్న నివేదికల్లో ఇది తాజాది. ”ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి, వారికి ఇల్లూ వాకిలి లేకుండా చేయడమనేది సర్వత్రా కనిపిస్తోంది. ఇదంతా కూడా ఒక పద్థతి ప్రకారం సాగుతోందనడానికి తగిన సాక్ష్యాధారాలు వున్నాయి. పైగా ప్రభుత్వ విధానంలో భాగంగా కొనసాగుతోంది. ఇటువంటి చర్యలన్నీ మానవాళికి వ్యతిరేకంగా సాగే నేరాలే.” అని ఆ నివేదిక స్పష్టం చేసింది. కరువును కూడా ఒక యుద్ధ సాధనంగా వాడుతున్నారని విమర్శించింది. గతేడాది అక్టోబరు నుండి ఈ ఏడాది జులై వరకు జరిగిన దారుణ సంఘటనలన్నింటినీ ఈ నివేదిక పొందుపరిచింది. ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో హింస, విధ్వంసంపైదృష్టి సారించింది. గాజాను దిగ్బంధించడం, మానవతా సాయానికి అడ్డంకులు సృష్టించడం, లక్ష్యిత ప్రాంతాలపై దాడులు, పౌరులు, సహాయక కార్యకర్తల హత్యలు వంటి చర్యలు చేపట్టడం ద్వారా ఇజ్రాయిల్ ఉద్దేశ్యపూర్వకంగానే కరువు కాటకాలు సృష్టించడం, హత్యలకు పాల్పడ్డం చేస్తోందని నివేదిక విమర్శించింది. కృత్రిమ మేథస్సు సాయంతో లక్ష్యాలపై దాడులు జరుపుతోందని పేర్కొంది. దీనివల్ల పౌర ఆవాసాలా కాదా అనేది తేడా కూడా చూడడం లేదని పేర్కొంది. కాగా దీనిపై ఇజ్రాయిల్ మిలటరీ నుండి లేదా విదేశాంగ శాఖ నుండి ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. అయితే గతంలో ఇదే రీతిలో వచ్చిన ఆరోపణలను ఇజ్రాయిల్ అధికారులు ఖండించారు. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే తమ బలగాలు వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. తప్పనిసరి సైనిక కారణాలు లేదా పౌరుల భద్రతా రీత్యా అవసరమనుకుంటే తప్ప ఆక్రమిత ప్రాంతం నుండి పౌరులెవరినీ బలవంతంగా ఖాళీ చేయించరాదని సాయుధ ఘర్షణల చట్టం స్పష్టంగా పేర్కొంటోంది. గత 13 మాసాలుగా సాగుతున్న దాడుల్లో ఇప్పటివరకు 43,736మరది మరణించారు. 1,03,370మంది గాయపడ్డారు. గత నెల రోజులకు పైగా ఉత్తర గాజా దిగ్బంధనం కొసాగుతోంది. బఫర్‌జోన్‌ల్లో, సెక్యూరిటీ కారిడార్లలో ఇలా పాలస్తీనియన్లను అటూఇటూ తరలించే ప్రక్రియ బహుశా శాశ్వతంగా కొనసాగించే అవకాశాలు వున్నాయని ఆ నివేదికలో మానవ హక్కుల సంస్థ పేర్కొంది. ఇటువంటి చర్యలు జాతి నిర్మూలన కిందకే వస్తాయని హెచ్చరించింది.
కొనసాగుతున్న దాడులు
గత నెల రోజుల్లో గాజాలో సహాయక కార్యకర్తలు 20మంది వరకు మరణించారని మానవతా సంస్థలు తెలిపాయి. సిరియా-లెబనాన్ సరిహద్దుల్లోని ప్రాంతాలపై దాడుల అనంతరం బీరుట్ దక్షిణ శివార్లలో ఆర్మీ దాడులు కొనసాగిస్తోంది. రాజధాని బీరుట్‌లోని హరెత్ హ్రీక్, బుర్జ్ అల్ బరజ్‌నెV్‌ా ప్రాంత ప్రజలు అక్కడ నుండి ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. అంతకు గంట క్రితమే బీరుట్‌లోనే మరో రెండు ప్రాంతాల్లో ప్రజలకు కూడా ఇదే రీతిలో ఆదేశాలు జారీ చేసింది. నెగెవ్ ప్రాంతంలోని ఉమ్ అల్ హిరాన్ గ్రామంలో చిట్టచివరి భవంతిని, మసీదును అధికారులు ధ్వంసం చేశారు. గ్రామంలోకి పెద్ద సంఖ్యలో బలగాలు చొచ్చుకు వచ్చి విధ్వంసానికి దిగాయి.