ఇజ్రాయిల్‌ దురాగతాలపై రేపటి నుండి ఐసిజె విచారణ

May 15,2024 00:22 #israel hamas war, #issrel, #War

గాజా : రఫాలో ఇజ్రాయిల్‌ దురాగతాలపై అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) గురువారం విచారణ చేపట్టనుంది. శుక్రవారం కూడా విచారణ కొనసాగనుంది. రఫాపై రాక్షస దాడులకు తెగబడుతున్న నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా ప్రకటించాలని కోరిన దక్షిణాఫ్రికాకు ఈజిప్టు, టర్కీ తాజాగా తోడయ్యాయి.
రఫాపై ముమ్మరంగా క్రూరమైన దాడులకు ఇజ్రాయిల్‌ దిగడంతో కైరో చర్చలు విఫలమయ్యాయని మధ్యవర్తిత్వం నెరపిన ఖతార్‌ పేర్కొంది. గత కొద్ది వారాలుగా పరిస్థితులు దారుణంగా దిగజారాయని ఖతార్‌ ప్రధాని మహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ రహమాన్‌ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదయం ఇజ్రాయిల్‌ బలగాలు తూర్పు రఫాలోని మారుమూల ప్రాంతాలపైనా బాంబుల వర్షం కురిపించాయి.జాబాలియా శరణార్ధ శిబిరాన్ని ధ్వంసం చేసింది. తూర్పు రఫా, జీటూన్‌ ఏరియాల్లో నివాస ప్రాంతాలపైన దాడులు జరపడంతో అనేక మంది చనిపోయినట్లు వార్తలొస్తున్నాయి. నుస్రత్‌ శరణార్ధ శిబిరంలో జరిగిన దాడిలో పిల్లలతో సహా 20మంది మరణించారు.ఉత్తర గాజాలో ఇజ్రాయిల్‌ యుద్ద ట్యాంకులు పాలస్తీనియన్ల ఇళ్ళను నేలమట్టం చేస్తూ, పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్ప డ్డాయి.
గాజాలో ఇజ్రాయిల్‌ దాడుల్లో చనిపోతున్న పాలస్తీనా పౌరులకు సంబంధించి పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్న రోజువారీ గణాంకాలు అత్యంత విశ్వసనీయమైనవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) పేర్కొంది. ఇప్పటివరకు ఈ దాడుల్లో 35వేలమంది వరకు మరణించారని, వీరిలో దాదాపు 25వేల మందిని గుర్తించామని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఇన్ని వేల మందిని గుర్తించారంటేనే ఈ డేటాలో ఎలాంటి తప్పు లేదని స్పష్టమవుతోందని డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధి క్రిస్టినా లిండ్‌మేర్‌ తెలిపారు. ఇజ్రాయిల్‌ ఈ గణాంకాలను విమర్శించిన నేపథ్యంలో డబ్ల్యుహెచ్‌ఓ వివరణ వెలువడింది. ఇప్పటివరకు 35,173మంది మరణించగా, 79,061మంది గాయపడ్డారు.

సహాయక సిబ్బంది కష్టాలు
రఫాపై ఉధృతంగా జరుగుతున్న దాడులతో నిర్వాసితులైన వేలాదిమంది పాలస్తీనియన్లకు ఆహారం, ఇతర సరఫరాలు పంపిణీ చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సహాయక కార్యకర్తలు తెలిపారు. గత వారం రోజుల్లో రఫా నుండి 3,60,000మంది పాలస్తీనియన్లు వెళ్ళిపోయారని ఐక్యరాజ్య సమితి పాలస్తీనా శరణార్దుల సంస్థ తెలిపింది. ఎయిడ్‌ క్రాసింగ్‌లను తెరిచామని ఇజ్రాయిల్‌ ఆదివారం ప్రకటించింది. కానీ గత వారం రోజులుగా దక్షిణ గాజాలోని రెండు ప్రధాన క్రాసింగ్‌ల్లోకి ఆహార ట్రక్కులు ఒక్కటి కూడా రాలేదు.. పరిస్థితులు రాన్రానూ భయంకరంగా తయారవుతున్నాయని ఐక్యరాజ్య సమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ ప్రతినిధి అబీర్‌ ఇటెఫా వ్యాఖ్యానించారు.

➡️