పురోగతి లేకపోతే మధ్యవర్తిత్వం నుండి వైదొలగుతాం

Apr 19,2025 06:47 #Europe, #Ukrain, #US
  • రష్యా-ఉక్రెయిన్‌ శాంతి ప్రయత్నాలపై అమెరికా

పారిస్‌: రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి లేని పక్షంలో రష్యా, ఉక్రెయిన్‌ శాంతి ఒప్పంద వ్యవహారంలో మధ్యవర్తిత్వం నుండి వైదొలిగేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. శాంతి ఒప్పందం కోసం వారాలు, నెలలు వేచి చూడలేమని, త్వరగా దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి వుందని అన్నారు. రాబోయే కొన్ని వారాల్లో ఈ శాంతి ఒప్పందం సాధ్యమేనా? కాదా? అని తేల్చుకోవాల్సి వుందని చెప్పారు. శుక్రవారం పారిస్‌లో యూరప్‌, ఉక్రెయిన్‌ నేతలతో భేటీ అనంతరం రూబియో మీడియాతో మాట్లాడారు. ట్రంప్‌ ఈ మధ్యవర్తిత్వ అంశంపై చాలా పట్టుదలతో, దృడంగా వ్యవహరించారని, ఇందుకోసం చాలా సమయాన్ని వెచ్చించారని, అయినా ఇంకా అది ఒక కొలిక్కి రాలేదని అన్నారు. ఉక్రెయిన్‌తో అమెరికా చర్చలలో కొంత పురోగతి సాధించినట్లు ఇంతకుముందు సంకేతాలు వెలువడిన సంగతి తెలిసిందే. అసలు ఇది సాధ్యమవుతుందా లేదా అనే అంశంపై నిర్ణయించాల్సిన సమయం ఆసన్నమైందని రూబియో విలేకర్లతో వ్యాఖ్యానించారు.

➡️