ఇస్లామాబాద్: పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బెయిలు కోసం శనివారం లాహోర్ హైకోర్టునాశ్రయించారు. మే9 నాటి హింసకు సంబంధించి తనపై అనేక కేసులు పెట్టి గత రెండేళ్లుగా జైలులోనే నిర్బంధించారని, ఇది రాజకీయ కక్ష సాధింపు తప మరొకటి కాదని ఆయన తన బెయిలు దరఖాస్తులో పేర్కొన్నారు. ఆ రోజు (మే9) హింసతో తనకెలాంటి సంబంధమూ లేదని ఇమ్రాన్ స్పష్టం చేశారు. తప్పుడు కేసులు బనాయించి అన్యాయంగా తనను జైలులో పెట్టారని, తనకు అరెస్టు అనంతర బెయిలు మంజూరు చేయాలని ఇమ్రాన్ కోరారు. ఆయన బెయిలు పిటిషన్‌ను యాంటీ టెర్రరిజం కోర్టు (ఎటిసి) తిరస్కరించడంతో ఇమ్రాన్ లాహోర్ హైకోర్టునాశ్రయించారు. ఇప్రమాన్ ఖాన్‌ను విడుదల జేయాలని కోరుతూ ఇటీవల పాకిస్తాన్‌లో ప్రదర్శనలు వెల్లువెత్తాయి. సైన్యం , ప్రభుత్వం కూడబలుక్కుని ఇమ్రాన్ ఖాన్‌ను వేధిస్తున్నాయని పిటిఐ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దేశం వీడి వెళ్లిపోతానంటే అవకాశమిస్తామని సైన్యం ఆఫర్ ఇవ్వగా, దానిని తిరస్కరించానని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల జైలు నుంచి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.