సిబ్బందిని సురక్షితంగా విడిపించిన ఐఎన్‌ఎస్ సుమిత్ర
న్యూఢిల్లీ : చేపల వేటలో వున్న ఇరాన్ నౌకను హైజాక్ చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సుమిత్ర విజయవంతంగా తిప్పి కొట్టింది. అడెన్ జలసంధిలో మోహరించి వున్న ఐఎన్‌ఎస్ సుమిత్ర సత్వరమే స్పందించి నౌకను, అందులోని సిబ్బందిని సురక్షితంగా విడిపించినట్లు నావికాదళం సోమవారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. సోమాలియా తూర్పు తీరం పొడవునా, అడెన్ జలసంధిలో సముద్ర దొంగల చౌర్యాన్ని అడ్డుకునే కార్యకలాపాల్లో భాగంగా ఆ ప్రాంతంలోనే మోహరించిన ఐఎఎన్‌ఎస్ సుమిత్ర, ఇరాన్ పతాకంతో వున్న ఫిషింగ్ ఓడ ఇమాన్‌ను హైజాక్ చేస్తున్నారంటూ వచ్చిన ఎస్‌ఓఎస్ సందేశానికి సత్వరమే స్పందించింది. చేపల ఓడలోకి సముద్రపు దొంగలు ఎక్కి, అందులోని సిబ్బందిని బందీలుగా తీసుకున్నారని, వెంటనే ఆ నౌకను అడ్డుకున్న ఐఎన్‌ఎస్ సుమిత్ర ఇటువంటి సందర్భాల్లో అనుసరించే ఆపరేషన్ ప్రామాణికాలను అనుసరించి బోటును, అందులోని 17మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడిందని ఆ ప్రకటన పేర్కొంది. ఆ తర్వాత నౌక తన ప్రయాణాన్ని సాగించిందని తెలిపింది. 2010 నుండి సముద్రపు దొంగల కార్యకలాపాలు చాలావరకు నిలిచిపోయాయి. తాజాగా ఎర్ర సముద్రంలో హౌతి రెబెల్స్ దాడులతో మళ్లీ ఈ సమస్య తలెత్తింది. డిసెంబరు, జనవరి మాసాల్లో ఇప్పటివరకు ఇలాంటి సమస్యలను పరిష్కరించిన భారత నావికాదళం సెంట్రల్, ఉత్తర అరేబియా సముద్రంలో తన నిఘాను గణనీయంగా పెంచింది. ప్రస్తుతం సముద్రపు దొంగల కార్యకలాపాలను అడ్డుకునేందుకు, అరేబియా, అడెన్ జలసంధిల్లో 12 యుద్ధ నౌకలు పనిచేస్తున్నాయి.