- ఫ్రాన్స్ సంస్థ నిర్ణయం
పారిస్ : మోసం, ముడుపుల ఆరోపణలతో అమెరికా న్యాయస్థానంలో ఛార్జిషీటును ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టబోమని ఫ్రెంచ్ చమురు, సహజ వాయువు కంపెనీ ‘టోటల్ ఎనర్జీస్’ ప్రకటించింది. అవినీతి ఏ రూపంలో జరిగినా దానిని అంగీకరించబోమని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కంపెనీ స్పష్టం చేసింది. అవినీతిపై విచారణ జరుగుతున్న విషయాన్ని అదానీ గ్రూప్ తనకు తెలియజేయలేదని చెప్పింది. ‘అదానీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్‌లపై వచ్చిన ఆరోపణలు, వాటి పరిణామాలపై స్పష్టత వచ్చే వరకూ ఆ కంపెనీల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టబోము’ అని టోటల్‌ఎనర్జీస్ తేల్చి చెప్పింది. అమెరికా ప్రాసిక్యూటర్లు న్యూయార్క్ కోర్టులో అదానీలపై ఛార్జిషీటు దాఖలు చేసిన కొద్ది రోజులకే ఫ్రాన్స్ కంపెనీ నుండి ఈ ప్రకటన వెలువడింది. ఆరోపణలకు సంబంధించి గౌతమ్ అదానీ, సాగర్ అదానీలపై న్యాయమూర్తి అరెస్ట్ వారంట్లు కూడా జారీ చేశారు.
అదానీ గ్రూపులోని అతి పెద్ద విదేశీ ఇన్వెస్టర్లలో టోటల్‌ఎనర్జీస్ ఒకటి. లిక్విఫైడ్ సహజ వాయువు వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ రెండు కంపెనీలు 2018లోనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2021 జనవరిలో అదానీ గ్రీన్ ఎనర్జీలో టోటల్‌ఎనర్జీస్ 19.75 శాతం వాటాలు కొనుగోలు చేసింది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్‌లో 37.4 శాతం వాటాలను, అదానీ గ్రీన్ ఎనర్జీతో కుదుర్చుకున్న మూడు పునరుద్పాదక ఉమ్మడి భాగస్వామ్యాలలో 50 శాతం వాటాలను కూడా కలిగి ఉంది. ఆయా కంపెనీల్లో వాటాదారుగా తన ప్రయోజనాల పరిరక్షణ కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటానని టోటల్‌ఎనర్జీస్ తెలిపింది. కాగా టోటల్‌ఎనర్జీస్ ప్రకటన తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీ వాటాల విలువ 11.3 శాతం పడిపోయింది.