టెహరాన్ : తమ అణు కార్యక్రమం సైనికీకరణ గురించి మాత్రమే చర్చలు పరిమితం చేసినట్లైతే అమెరికాతో చర్చలు జరిపే అంశాన్ని పరిశీలిస్తామని ఇరాన్ తెలిపింది. ఈ మేరకు ఇరాన్ యుఎన్ మిషన్ ఎక్స్‌లో ఆదివారం ఒక పోస్టు పెట్టింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని సైనికపరమైన అవసరాలకు ఉపయోగించే అవకాశం వుందా అన్నదే చర్చల లక్ష్యమనుకుంటే దాని గురించి పరిశీలించడానికి సిద్ధమని ఆ పోస్టు పేర్కొంది. ఒబామా హయాంలో సాధించలేనిది, తమ హయాంలో సాధించామని చెప్పుకోవడానికే వారు ఇరాన్ శాంతియుత అణు కార్యక్రమాన్ని ధ్వంసం చేయాలనుకుంటే అటువంటి చర్చలు ఎన్నడూ జరగబోవని ఇరాన్ మిషన్ స్పష్టంచేసింది. శనివారం ఇరాన్ మతపెద్ద ఆయతుల్లా అలీ ఖమేని అమెరికాతో చర్చలకు తిరస్కరించారు. ఇరాన్ క్షిపణి కార్యక్రమంపై, ఈ ప్రాంతంలో దాని ప్రభావంపై ఆంక్షలు విధించే ఉద్దేశంతోనే వారు ఆహ్వానించారని ఖమేని విమర్శించారు. పైగా ఇలాంటి చర్చలు ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య గల సమస్యలను పరిష్కరించవని అన్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందంపై చర్చలకు సిద్ధమంటూ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
