టెహరాన్ : వెయ్యి కిలోమీటర్లు దూరంలో గల ఓడలను చేరుకునే సామర్ధ్యం గల యుద్ధ నౌకల విధ్వంసక క్షిపణిని ఇరాన్ శనివారం ప్రయోగించింది. ఈ మేరకు ప్రభుత్వ టివి నివేదిక తెలిపింది. అంటే ఒమన్ పర్షియన్ గల్ఫ్ తీరంలో అమెరికా నావికాదళానికి చెందిన నౌకలను ఈ క్షిపణి చేరుకోగలదు. ”ఇది ఘదర్-380 మైల్ టైప్ ఎల్. దీని రేంజ్ వెయ్యి కిలోమీటర్లు. దీనికి జామింగ్ నిరోధక సామర్ధ్యం వుంది.” అని రివల్యూషనరీ గార్డ్ నావికాదళ అధిపతి జనరల్ అలీ రెజా చెప్పారు. ఇరాన్ దక్షిణ తీర ప్రాంతంలో భూగర్భంలోని క్షిపణి కేంద్రాన్ని వార్తల్లో చూపించారు. అయితే ఈ పరీక్ష ఎప్పుడు జరిగిందనే వివరాలు గానీ, ఆ క్షిపణిక యుద్ధ శీర్షం వుందా లేదా అనే సమాచారం గానీ వెల్లడించలేదు. ఈ క్షిపణి కేంద్రమనేది రివల్యూషనరీ గార్డుకు గల క్షిపణి వ్యవస్థల్లో ఒకటని అలీ రెజా వెల్లడించారు. ఈ క్షిపణులు శత్రువు యుద్ధనౌకలకు నరకం సృష్టించగలవని హెచ్చరించారు. ఇది అత్యంత అధునాతనమైన కొత్త ఆయుధమని మాత్రమే ఆ నివేదిక పేర్కొంది. సెంట్రల్ ఇరాన్‌లోని భూగర్భ కేంద్రం నుండి ఒమన్ సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఐదు నిముషాల్లోపే ఈ క్షిపణిని సిద్ధం చేసి, ప్రయోగించవచ్చన్నారు. 2011 నుండి ఇరాన్ ప్రతిసారీ క్షిపణి పరీక్షలతో పాటూ భూగర్భ క్షిపణి కేంద్రాలనూ ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తూ వస్తోంది. దేశవ్యాప్తంగా ఈ భూగర్భ కేంద్రాలు వున్నాయని, అలాగే వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధి తీరం పొడవునా కూడా వున్నాయని తెలిపింది.
