nuclear talks : ఈ వారంలో ఇరాన్‌ విదేశాంగ మంత్రి మాస్కో పర్యటన

  • ఇరాన్‌పై సత్వరమే నిర్ణయం తీసుకుంటామన్న ట్రంప్‌

దుబాయ్ : ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చి ఈ వారంలో రష్యాలో పర్యటించనున్నారు. ఒమన్‌లో అమెరికాతో జరిగిన తాజా చర్చల వివరాలను మాస్కోకు తెలియచేసేందుకు మంత్రి పర్యటిస్తున్నట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి సోమవారం తెలిపారు. పశ్చిమ దేశాలతో గల అణు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరాన్‌ తన దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్‌ బాఘేరి చెప్పారు. అలాగే తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ఆంక్షల వల్ల నెలకొన్న ఒత్తిళ్ళను తగ్గించుకోవాలని చూస్తున్నామన్నారు. ఈ వారంలో ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షక సంస్థ చీఫ్‌ రాఫెల్‌ గ్రాసీ ఇరాన్‌లో పర్యటనకు వస్తున్నారని చెప్పారు. శనివారం రోమ్‌లో అమెరికాతో రెండో దశ చర్చలు జరుగుతాయని ఇరాన్‌ భావిస్తోంది. ఈ చర్చల్లో కేవలం అణు అంశంపై, ఆంక్షల ఎత్తివేతపై మాత్రమే దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపింది. ఉద్రిక్తతలు పెచ్చరిల్లేందుకు దారి తీసే చర్యలపై కన్నా దౌత్య సంబంధాల పటిష్టతపై దృష్టి పెట్టాలని రష్యా ఇప్పటికే కోరింది. గత వారంలో, ఇరాన్‌ అణు కార్యక్రమంపై నిపుణుల స్థాయిలో రష్యా, చైనా, ఇరాన్‌లు చర్చలు జరిపాయి.

త్వరలోనే నిర్ణయం

ఇరాన్‌పై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆదివారం చెప్పారు. విమానంలో విలేకర్లతో మాట్లాడుతూ ట్రంప్‌, ఇరాన్‌పై సలహాదారులతో సమావేశమయ్యానని, సత్వరమే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. ఈ చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరకపోతే మిలటరీ చర్య తీసుకుంటామని అంతకుముందు ట్రంప్‌ హెచ్చరించారు. అయితే తొలిసారి చర్చలు జరిగిన గత శనివారం దీనిపై స్పందిస్తూ, ‘అంతా బాగానే జరుగుతుంది, ఇరాన్‌ పరిస్థితి కూడా బాగానే వుంది.’ అని వ్యాఖ్యానించారు.

➡️