ఢాకా : వివాదస్పద అధ్యాత్మిక సంస్థ ‘ఇస్కాన్’కు చెందిన సన్యాసి చిన్మయి కృష్ణ దాస్ బ్రహ్మచారిని బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అతను బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా ఉన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయంటూ వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల జరిగిన ఆందోళనల్లో అతను పాల్గొన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా చట్టొగ్రామ్‌లోని కొత్త మార్కెట్ ఏరియాలో బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని కృష్ణదాస్ అవమానించారని ఆరోపిస్తూ అతడితో సహా 19 మందిపై దేశద్రోహం నేరం కింద ఈ ఏడాది అక్టోబరు 30న కేసు నమోదు చేశారు. ఇదే కేసులో సోమవారం ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ పోలీసుల డిటెక్టివ్ బ్రాంచ్ అధికారులు అతణ్ని కస్టడీలోకి తీసుకున్నారు. సోమవారం ఆయనను అదుపులోకి తీసుకున్న వెంటనే ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. కానీ దాన్ని న్యాయస్థానం తిరస్కరించింది. కృష్ణదాస్ అరెస్టును నిరసిస్తూ ఇస్కాన్ తదితర హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఢాకా, చిట్టగాంగ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో అనేకమంది గాయపడ్డారు. పలుచోట్ల రహదారులను దిగ్బంధించారు.
భారత్ ఆందోళన
కృష్ణదాస్‌ను అరెస్టు చేయడం, బెయిల్‌కు తిరస్కరించిన పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటన జారీ చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై పలు దాడుల నేపథ్యంలో ఈసంఘటన చోటు చేసుకుందని ఆ ప్రకటన పేర్కొంది. మైనారిటీల ఇళ్ళు, వాణిజ్య సముదాయాలు దగ్ధం చేసిన, లూటీ చేసిన కేసులు కూడా అనేకం వున్నాయని పేర్కొంది. అలాగే ఆలయాలపై, ఆరాధనా స్థలాలపై విధ్వంసానికి పాల్పడడం, విగ్రహాలను దొంగిలించడం వంటి సంఘటనలు కూడా జరిగాయని తెలిపింది. శాంతియుత నిరసనల ద్వారా తమ చట్టబద్ధమైన డిమాండ్ల సాధన కోసం గొంతెత్తిన వారిపై ఇలా అభియోగాలు నమోదు చేయడం దురదృష్టకరమని పేర్కొంది.