ఇజ్రాయిల్ – హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు ఆమోదం

ఇంటర్నెట్ డెస్క్ : అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాయి. ఇజ్రాయిల్ – హిజ్బుల్లాల  మధ్య కాల్పుల విరమణ బుధవారం తెల్లవారుజామున నుండి అమల్లోకి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్ మధ్యవర్తిత్వం చేసిన ఒప్పందాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. గత సంవత్సరం గాజా యుద్ధంతో చెలరేగినప్పటి నుండి వేలాది మందిని పొట్టనపెట్టుకున్న ఇజ్రాయెల్-లెబనీస్ సరిహద్దులో వివాదానికి ముగింపు పలకడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇజ్రాయిల్ భద్రతా మంత్రివర్గం 10-1 ఓట్లలో ఒప్పందాన్ని ఆమోదించిన కొద్దిసేపటికే బిడెన్ మంగళవారం వైట్‌హౌస్‌లో మాట్లాడారు. తాను ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికాటితో మాట్లాడానని, స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున నుండి పోరాటం ముగుస్తుందని ఆయన చెప్పారు. లెబనాన్ సైన్యం ఇజ్రాయిల్‌తో సరిహద్దుకు సమీపంలో ఉన్న భూభాగాన్ని ఆధీనంలోకి తీసుకున్నందున ఇజ్రాయిల్ క్రమంగా తన బలగాలను ఉపసంహరించుకుంటుంది. హిజ్బుల్లా అక్కడ తన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించకుండా చూసుకుంటుందని బిడెన్ చెప్పారు. రెండు వైపులా ఉన్న పౌరులు త్వరలో తమ కమ్యూనిటీలకు సురక్షితంగా తిరిగి రాగలుగుతారని బిడెన్ చెప్పారు.

అంతకముందు లెబనాన్‌లోని హిజ్బుల్లాతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ప్రకటించారు. లెబనాన్‌లోని హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం గురించి తన భద్రతా క్యాబినెట్‌తో సమావేశం తర్వాత ఈ ప్రకటన చేశారు. అయితే హిజ్బుల్లా నుండి ఉల్లంఘన జరిగితే గట్టిగా ప్రతిస్పందిస్తానని చెప్పారు.

అయితే ఈ ఒప్పందంపై హిజ్బుల్లా, ఇరాన్ నుండి అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

➡️