టెల్ అవీవ్/బీరుట్ : లెబనాన్ రాజధాని బీరుట్ నగరంపై ఇజ్రాయిల్ బాంబుల వర్షంతో విరుచుకుపడింది. బీరుట్, లెబనాన్ ఇతర ప్రాంతాలపై 24 గంటల్లో 216 వైమానిక దాడులు చేసింది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆదివారం ఇజ్రాయిల్ దాడి కారణంగా 105 మంది మరణించగా, 359 మంది గాయపడ్డారు. బీరుట్ పై ఇజ్రాయిల్ దాడి చేయడం ఇదే తొలిసారి. ఒక సంవత్సరంలో గాజాలో అర మిలియన్ల మందిని, లెబనాన్‌లో 1640 మందిని చంపినప్పటికీ ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపలేదు. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైన తర్వాత, సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ కూడా వైమానిక దాడిలో మరణించారు. నస్రల్లాతో పాటు తన సీనియర్ కమాండర్లలో ఒకరైన అలీ కరాకీ కూడా చంపబడ్డారని హిజ్బుల్లా ధృవీకరించింది.
మరోవైపు ఆదివారం యెమెన్‌పై ఇజ్రాయిల్ దాడి చేసింది. యుద్ధ విమానాలు హోడెయిడా ఓడరేవు మరియు సమీపంలోని పవర్ ప్లాంట్‌పై దాడి చేశాయి. హౌతీ సైనిక స్థావరాలపై దాడి జరిగిందని, ఇజ్రాయిల్ చేరుకోలేని ప్రదేశం లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ అన్నారు.
1980ల నుండి హిజ్బుల్లాకు నాయకత్వం వహించిన నబిల్ కౌక్, 2006లో ఇజ్రాయిల్‌తో జరిగిన యుద్ధంలో హిజ్బుల్లా యొక్క దక్షిణ ప్రాంతీయ కమాండర్‌గా ఉన్నారు. ఇజ్రాయిల్ చేత చంపబడిన ఏడవ అగ్ర నాయకుడు కౌక్.
నస్రల్లా హత్య చరిత్రలో ఒక మలుపు అని, ఇజ్రాయిల్‌కు ఒక ముఖ్యమైన విజయంగా ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. గాజా దాడిని నిలిపివేయాలని, బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇజ్రాయెల్‌లో భారీ నిరసనలు కొనసాగుతున్నప్పుడు దాడి లెబనాన్‌కు విస్తరిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను దారి మళ్లించి అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇజ్రాయిరింత సైన్యాన్ని లెబనీస్ సరిహద్దులో మోహరించింది. ట్యాంకులు, సాయుధ వాహనాలు సరిహద్దు వైపు కదులుతున్నాయి.
నస్రల్లా ప్రాణాలు తీసినందుకు ప్రతీకారం తీర్చుకోకుండా ఆగబోనని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రకటించారు. అమెరికా సహాయంతో ఇజ్రాయిల్ నిరంతరం కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఇరాన్‌ను యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మొత్తం మీద యుద్ధం జరిగితే అమెరికా జోక్యం చేసుకోవచ్చు. పశ్చిమాసియాలో పరిస్థితిని గందరగోళంగా మార్చడం వెనుక ఇరాన్ అణు కార్యక్రమాన్ని నాశనం చేయాలనే అమెరికా కుటిల ఉద్దేశం కూడా ఉంది.