- డమాస్కస్‌కి చేరువగా సేనలు
- యుద్ధ విమానాల ద్వారా బాంబుల వర్షం
డమాస్కస్ : అసద్ పతనం తర్వాత అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ ఇష్టానుసారంగా చెలరేగిపోతోంది. సిరియాకు చెందిన గొలాన్ హైట్స్ బఫర్ జోన్‌ను ఇప్పటికే ఆక్రమించుకున్న ఇజ్రాయిల్ సైన్యం ఇప్పుడు డమాస్కస్ దిశగా చొచ్చుకెళ్తోంది. ఇజ్రాయిలీ దళాలు వైమానిక, భూతల దాడులతో సిరియాలో పెద్దయెత్తున విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. గొలాన్ హైట్స్ బఫర్ జోన్‌ను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్ చర్యను అరబ్ ప్రపంచం తీవ్రంగా ఖండించింది. 1973 సిరియా, ఇజ్రాయిల్ యుద్ధం (దీనినే అక్టోబర్ యుద్ధం అని కూడా పిలుస్తారు) తర్వాత కుదుర్చుకున్న ఒప్పందంలో ఉభయ దేశాల సరిహద్దుల్లోని గొలాన్‌హైట్స్ ప్రాం తాన్ని బఫర్‌జోన్‌గా ప్రకటించారు. అక్కడ సైనిక సంచారం లేకుండా చూసే బాధ్యతను యుఎన్ డిజెంగేజ్‌మెంట్ అబ్జర్వ్ ఫోర్స్ (యుఎన్‌డిఒఎఫ్) కు అప్పగించారు. యాభై ఏళ్ల క్రితం నాటి ఈ ఒప్పం దానికి ఇజ్రాయిల్ నిలువునా తూట్లు పొడుస్తూ, బఫర్‌జోన్‌ను ఆక్రమించుకుంది. సిరియాలోని ఇతర ప్రాంతాలను కూడా ఆక్రమిం చేందుకు అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ దాడులను ఉధృతం చేసింది. సిరియా భూభాగం లోకి ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకొస్తున్నాయని సిరియా ప్రతిపక్ష యుద్ధ పర్యవేక్షక సంస్థ తెలిపింది. సిరియా నావికాదళాన్ని మొత్తంగా నాశనం చేశామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి ప్రకటించారు. దక్షిణ సిరియాలో నిస్సైనికీకరణ మండలాన్ని ఏర్పాటు చేస్తామని రక్షణ మంత్రి ఇజ్రాయిల్ కట్జ్ పేర్కొన్నారు. సిరియాలో తీవ్రవాదం వేళ్ళూనుకోకుండా నివారించేందుకే ఈ చర్యలని చెప్పారు. అసద్ పంథాను ఎవరు అనుసరించినా వారికి అసద్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. గత 48గంటల్లో 350కి పైగా వైమానిక దాడులకు ఇజ్రాయిల్ పాల్పడింది. సిరియాలోని వ్యూహాత్మక ఆయుధ నిల్వల కేంద్రాలను చాలావరకు ధ్వంసం చేసేశామని తెలిపింది. తీవ్రవాదుల చేతుల్లోకి ఆ ఆయుధాలు వెళ్ళకూడదనే ఉద్దేశంతోనే ఈ దాడులు జరిపామంటూ సమర్ధించుకుంది. సిరియా నావికాదళానికి చెందిన రెండు నౌకాశ్రయాలపై ఒకేసారి క్షిపణి నౌకలతో దాడి చేశామని మిలటరీ తెలిపింది. సిరియాలో అసద్‌ను పదవీచ్యుతుణ్ణి చేసిన తర్వాత ఏర్పాటు చేసే ‘సాల్వేషన్ గవర్నమెంట్’కు మహ్మద్ అల్ బషీర్ సారథ్యం వహిస్తారని హెచ్‌టిఎస్ నేత అబూ మహ్మద్ జొలాని ప్రకటించారు.
దేశాన్ని పునర్నిర్మిస్తాం : తాత్కాలిక ప్రధాని హామీ
సిరియాను మొత్తంగా పునర్నిర్మిస్తామని తాత్కాలిక కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బషీర్ హామీ ఇచ్చారు. అయితే నగదు సంక్షోభం తీవ్రంగా వుందని వ్యాఖ్యానించారు. లక్షల సంఖ్యలో ఉన్న శరణార్దులందరినీ వెనక్కి రప్పిస్తామని చెప్పారు. పౌరులందరికీ రక్షణ కల్పిస్తామని, మౌలిక సేవలందిస్తామని హామీ ఇచ్చారు. విదేశీ కరెన్సీ కొరత చాలా తీవ్రంగా వున్నందున కష్టం కాగలదన్నారు. 35వేల సిరియన్ పౌండ్లు పెడితే ఒక్క డాలరును కొనుగోలు చేయగలమని చెప్పారు. ఇక రుణాలు, బాండ్ల గురించి డేటా సేకరిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా అయితే పరిస్థితి చాలా అధ్వాన్నంగా వుందన్నారు.
అమెరికా, ఇజ్రాయిల్ కుట్రలకు అసద్ బలి : ఇరాన్ అధినేత ఖమేని
అమెరికా, ఇజ్రాయిల్ ఒక పథకం ప్రకారమే అసద్ ప్రభుత్వాన్ని కూల్చివేశాయని ఇరాన్ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని బుధవారం వ్యాఖ్యానించారు. సిరియా పొరుగుదేశాల్లో ఒకరికి కూడా ఇందులో పాత్ర వుందన్నారు. ఆ దేశం పేరును ఆయన వెల్లడించలేదు. అయితే అసద్ వ్యతిరేక రెబెల్స్‌కు మద్దతిచ్చే టర్కీ గురించే ఆయన ఈ ప్రస్తావన చేసినట్లు కనిపిస్తోంది.
”సిరియాలో చోటు చేసుకున్న పరిణామాలన్నీ అమెరికా, ఇజ్రాయిల్ కమాండ్ రూమ్‌ల్లో రచించిన పథకం ప్రకారమే జరిగాయనడానికి మా దగ్గర సాక్ష్యాధారాలున్నాయి. సిరియా పొరుగు ప్రభుత్వం కూడా ఇందులో పాలు పంచుకుంది.” అని ఖమేని తెలిపారు.
అసద్ ప్రభుత్వం కూలిపోయిన గంటల వ్యవధిలో ఇరాన్ స్పందిస్తూ దూరదృష్టితో, వివేచనా దృక్పథంతో కూడిన సంబంధాలను డమాస్కస్‌తో కొనసాగించాలని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించింది. సిరియా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా ప్రభుత్వ ఏర్పాటు జరగాలని పిలుపునిచ్చింది.