- జెనిన్ నగరంపై దాడులు
- 9మంది మృతి, 35మందికి గాయాలు
జెరూసలేం : ఒకపక్క గాజాలో కాల్పుల విరమణ అమల్లో వుండగా, మరోపక్క వెస్ట్ బ్యాంక్ నగరమైన జెనిన్‌పై ఇజ్రాయిల్ సైనిక బలగాలు హెలికాప్టర్లతో మంగళవారం విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 9మంది పాలస్తీనియన్లు మరణించారు. 35మంది గాయపడ్డారు. పెద్ద ఎత్తున జరిగిన మిలటరీ ఆపరేషన్ ఇదని ప్రధాని బెంజామిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. పాలస్తీనా గ్రామాలపై దాడి చేసిన ఇజ్రాయిల్ సెటిలర్లపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ దాడులు చోటు చేసుకున్నాయి. గాజా, లెబనాన్, సిరియా, యెమెన్, జుడియా, సామారియా ఇలా ఎక్కడ ఇరాన్ తన ప్రభావం చూపించినా అక్కడ తాము కచ్చితంగా, కృతనిశ్చయంతో వ్యవహరిస్తామని నెతన్యాహు చెప్పారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ గురించి చెప్పేటపుడు జుడియా, సామారియా అనే పదాలను ఇజ్రాయిల్ ఉపయోగిస్తూ వుంటుంది. గాజాలో కాల్పుల విరమణ ప్రారంభమైన రెండు రోజుల తర్వాత జెనిన్‌పై దాడులు జరిగాయి. సైనికులు, పోలీసులు, ఇంటెలిజెన్స్ సర్వీసులు జెనిన్‌లో తీవ్రవాద నిరోధక ఆపరేషన్‌ను ప్రారంభించాయని మిలటరీ ప్రకటించింది. శరణార్ధ శిబిరం, హమాస్, ఇస్లామిక్ జిహాద్‌లకు చెందిన ప్రధాన కేంద్రంపై తమ పట్టును పునరుద్ఘాటించేందుకు వెస్ట్ బ్యాంక్‌లో పాలస్తీనా భద్రతా బలగాలు వారాల తరబడి ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఆ నేపథ్యంలో మిలటరీ ప్రకటన వెలువడింది. ఇటీవల కాలంలో హమాస్ తన కార్యకలాపాలను వెస్ట్ బ్యాంక్‌లో విస్తరిస్తోంది. ఇజ్రాయిల్‌పై పోరాటాన్ని ఉధృతం చేయాల్సిందిగా మంగళవారం హమాస్ పాలస్తీనియన్లకు పిలుపిచ్చింది. ఆపరేషన్ ప్రారంభం కాగానే, పాలస్తీనా భద్రతా బలగాలు శరణార్ధ శిబిరం నుండి వైదొలిగాయి. పెద్ద ఎత్తున కాల్పుల మోత కూడా వినిపించింది. ఇజ్రాయిల్ జరిపిన ఈ దాడుల్లో 9మంది మరణించారని, 35మంది గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య సేవల విభాగం తెలిపింది.