Ceasefire: లెబనాన్‌పై ఇజ్రాయిల్ సైన్యం దాడి

బీరుట్: ఇజ్రాయిల్ – హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి ఒకరోజు పూర్తి కాకుండానే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయిల్ సైన్యం దాడి చేసింది. రాకెట్ నిల్వ కేంద్రంలో హిజ్బుల్లా కార్యకలాపాలను గుర్తించిన తరువాత లెబనాన్‌పై తమ యుద్ధ విమానాలు కాల్పులు జరిపాయని ఇజ్రాయిల్ పేర్కొంది. హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లగించడంతో దాడి చేశామని ఇజ్రాయిల్ పేర్కొంది. ఇజ్రాయిల్ – హిజ్బుల్లా మధ్య 14 నెలలుగా కొనసాగిన సంఘర్షణ కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దక్షిణ లెబనాన్‌లోని కొన్ని ప్రాంతాలకు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై కాల్పులు జరిపినట్లు ఇజ్రాయిల్ మిలటరీ పేర్కొంది. వివరాలు ఇవ్వకుండానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని లెబనాన్ ప్రభుత్వ జాతీయ వార్తా సంస్థ తెలిపింది.

ఇప్పటివరకు లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరిపిన కాల్పుల్లో 3,760 మందికి పైగా లెబనాన్‌లు మరణించారని లెబనాన్ ఆరోగ్య అధికారులు తెలిపారు. వారిలో చాలా మంది పౌరులున్నారు.  ఇజ్రాయిల్‌లో 70 మందికి పైగా మరణించారు. వారిలో సగం మంది పౌరులున్నారు.

➡️