పాలస్తీనియన్ల ప్రక్షాళనే లక్ష్యంగా ఇజ్రాయిల్‌ దాడులు

  • ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విమర్శ
  • అమెరికా, మిత్రపక్షాలకూ భాగస్వామ్యం
  • పశ్చిమాసియా పరిస్థితులపై నివేదిక విడుదల

కైరో : గాజాలో గత 13 మాసాలుగా ఇజ్రాయిల్‌ మారణహోమానికి పాల్పడుతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ విమర్శించింది. ప్రాణాంతకమైన దాడులకు, విధ్వంసానికి పాల్పడుతూ పాలస్తీనియన్లను ఉద్దేశ్యపూర్వకంగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. కీలకమైన మౌలిక వసతులను నాశనం చేస్తూ, ఆహారం, మందులు, ఇతర రకాల సాయాన్ని అందనివ్వకుండా చేస్తోందని పేర్కొంది. ఈ మేరకు పశ్చిమాసియాలో పరిస్థితులపై గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఊచకోతలో అమెరికా దాని మిత్రపక్షాలకు కూడా భాగస్వామ్యం వుందని పేర్కొంటూ తక్షణమే వారు ఆయుధ సరఫరాలను నిలిపివేయాలని పిలుపిచ్చింది. ఇది కచ్చితంగా నర మేధమే, వెంటనే దీన్ని ఆపాల్సిందేనని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్రటరీ జనరల్‌ ఆగెస్‌ కేలామర్ద్‌ ఆ నివేదికలో స్పష్టం చేశారు. పోషకాహార లోపం, వ్యాధులు ఈ రెండూ కలిసి పాలస్తీనియన్లపై నెమ్మదిగా దాడి చేస్తున్నాయని, ఫలితంగా వారు నెమ్మదిగా మృత్యువుకు చేరవవుతున్నారని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 21వ శతాబ్దంలో మరే ఘర్షణలు, యుద్ధాల్లో చూడని విధంగా గాజాల్లో అత్యంత వేగంగా విధ్వంసం, మరణాలు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్‌ తక్షణమే ఈ మానవ సంహారాన్ని ఆపాలంటూ ఇప్పటివరకు పాలస్తీనా మిత్రపక్షాలు, మానవ హక్కుల గ్రూపులు కోరుతున్నాయి. తాజాగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ కూడా అవే డిమాండ్లతో నివేదిక వెలువరించింది. తన చర్యల ద్వారా ఇజ్రాయిల్‌ 1951 ఊచకోత ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆ నివేదిక విమర్శించింది. నెమ్మదిగా, ఒక పద్ధతితో పాలస్తీనియన్లు మృత్యువుకు చేరువయ్యేలా ఇజ్రాయిల్‌ చర్యలు వుంటున్నాయని పేర్కొంది. గాజాపై జరుగుతున్న దాడుల తీరును నివేదిక వివరించింది. ఇజ్రాయిల్‌ ప్రభుత్వం, మిలటరీ, అధికారులు చేసిన వందకు పైగా ప్రకటనలను సమీక్షించామని, తద్వారా వారి అసలు ఉద్దేశ్యాన్ని నిర్ధారించేందుకు ప్రయత్నించామని నివేదికలో పేర్కొన్నారు. ఇళ్ళను, పొలాలను, ఆస్పత్రులను, నీటి సదుపాయాలను ఇలా దైనందిక జీవితంలో అవసరమయ్యే వాటిని ధ్వంసం చేసి కాలక్రమంలో పాలస్తీనియన్ల జీవన ప్రమాణాలను దెబ్బతీయాలని, అంతిమంగా వారిని నిర్మూలించాలన్నది ఇజ్రాయిల్‌ లక్ష్యంగా వుందని ఆ నివేదిక విమర్శించింది. కాగా, ఇజ్రాయిల్‌ ఈ ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చుతోంది. ఇవన్నీ యూదు వ్యతిరేక అపవాదులేనని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇటువంటి ఆరోపణలను సవాలు చేస్తున్నామని పేర్కొంది. కల్పిత కథనాలతో పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఈ నివేదికలో ఇచ్చారని ఇజ్రాయిల్‌ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో విమర్శించింది.

➡️