రఫాలో ఇజ్రాయిల్‌ దాడులు ఉధృతం

May 14,2024 08:24 #Attacks, #intensify, #Israel, #Rafah
  • గడచిన 24గంటల్లో 57మంది మృతి
  • రఫాను వీడిన మూడున్నర లక్షల మందికి పైగా ప్రజలు
  • రఫాలో కుప్పకూలనున్న ఆరోగ్య వ్యవస్థ
  • జాబాలియా శరణార్ధ శిబిరం నుండి వందలాదిమంది తరలింపు

గాజా : గాజాలోని ఉత్తర, దక్షిణ, సెంట్రల్‌ ప్రాంతాల్లో రాత్రిపగలు అనే తేడా లేకుండా ఇజ్రాయిల్‌ బలగాలు వైమానిక దాడులు కొనసాగిస్తున్నాయి. ఉత్తర గాజాలోని జాబాలియా శరణార్ధుల శిబిరం వున్న ప్రాంతంలోకి, రఫా నగరంలోకి ఇజ్రాయిల్‌ బలగాలు, ట్యాంకులు చొచ్చుకుపోయాయి. అక్కడ రాత్రంతా ఉధృతంగా వైమానిక దాడులు కొనసాగిన తర్వాత సోమవారం ఉదయం నుండీ మిలటరీ దాడులు మొదలయ్యాయి. గడచిన 24 గంటల్లో 57మంది మరణించగా, 82మంది గాయపడ్డారు. ఇప్పటివరకు దాదాపు 3,60,000మంది పాలస్తీనియన్లు రఫా నగరాన్ని వీడి వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి వర్గాలు పేర్కొన్నాయి. రఫా నుండి ఖాన్‌ యూనిస్‌ నగరానికి ప్రజలు బారులు తీరి వెళ్లడం కనిపిస్తోంది. ఏప్రిల్‌ 3 నుండి మే 8 మధ్యలో ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించినట్లైతే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థ్ధమవుతోంది. జాబాలియా శరణార్ధ శిబిరంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని పాఠశాలలు నిర్వాసితులకు నెలవుగా మారాయి. శిబిరాలు వేసుకుని కూడా వేలాదిమంది ప్రజలు నివసించేవారు సోమవారం ఉదయం ఇజ్రాయిల్‌ సైనిక బలగాలు అక్కడ నుండి బలవంతంగా వందలాదిమంది నిర్వాసితులను ఖాళీ చేయించాయి. అక్కడ నుండి పశ్చిమ దిశగా వందల సంఖ్యలో కుటుంబాలు వెళ్లడం కనిపిస్తోందని ఇదంతా చిత్రీకరించిన అల్‌జజీరా మీడియా తెలిపింది. రఫా నగరంలోని కువైట్‌ ఆస్పత్రి నుండి వైద్య సిబ్బందిని వెళ్లిపోవాల్సిందిగా బలగాలు ఆదేశించాయి. దాంతో మరికొద్ది గంటల్లో గాజావ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడం ఖాయమని గాజా ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు.

కాల్పుల విరమణే పరిష్కారం : ఐరాస
గత ఏడు మాసాలుగా జరుగుతున్న ఈ దాడుల్లో మృతుల సంఖ్య 35వేలు దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తక్షణమే బేషరతుగా కాల్పుల విరమణ జరగడమొక్కటే ఈ సమస్యకు పరిష్కారమని ఐరాస చీఫ్‌ అంటానియో గుటెరస్‌ పేర్కొన్నారు. బందీలందరినీ విడుదల చేసి, మానవతా సాయాన్ని పెంచాలని కోరారు.

అంతర్జాతీయ వర్ణ వివక్ష సదస్సు ఖండన
ఇజ్రాయిల్‌ సెటిలర్ల వలసవాదాన్ని అంతర్జాతీయ వర్ణ వివక్ష సదస్సు తీవ్రంగా ఖండించింది. పాలస్తీనియన్ల కోసం జోహాన్నెస్‌బర్గ్‌లో శుక్రవారం నుండి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చింది. గాజాపై ఇజ్రాయిల్‌ సాగిస్తున్న యుద్దాన్ని, అక్రమ సెటిలర్ల వలసవాదాన్ని, ఇతర అంశాలను ప్రముఖంగా ఆ సదస్సులో ప్రస్తావించారు. 25కి పైగా దేశాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ”ఒక శతాబ్దపు వలస వాదం, 75ఏళ్ల పాటు సాగుతున్న ప్రజల వలసలు (నక్బా), 75ఏళ్ల ఇజ్రాయిల్‌ ఊచకోత, వలసవాదం, వర్ణవివక్షపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ” నేతలు ఒక ప్రకటన జారీ చేశారు. భూతల, జల, వాయు మార్గాల్లో ఇజ్రాయిల్‌ పాశవికంగా జరిపిన దాడులను ప్రపంచం యావత్తు చూస్తోందని, మొత్తంగా గాజాను నిర్మూలనా శిబిరంగా మార్చేవేసిందని ఆ ప్రకటన విమర్శించింది. విద్య, ఆరోగ్యం, పోషకాహారం, మౌలిక సదుపాయాలు ఇలా గాజా ప్రజల జీవన పరిస్థితులన్నింటినీ ఇజ్రాయిల్‌ పూర్తిగా నాశనం చేసిందని పేర్కొంది.

➡️