హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్‌ దాడులు

  • కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని లెబనాన్‌ ఆగ్రహం
  • నేడు ముగ్గురు బందీలు, 90మంది ఖైదీల విడుదల

గాజా, బీరుట్‌ : సిరియా-లెబనాన్‌ సరిహద్దు పొడవునా బెకా వ్యాలీలో హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రంతా దాడులు జరిపినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ శుక్రవారం ప్రకటించింది. ఈ లక్ష్యాల్లో భూగర్భంలో ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించే కేంద్రం, లెబనాన్‌లోకి ఆయుధాలను అక్రమంగా రవాణా చేసే స్థావరం వున్నాయని ఆర్మీ తెలిపింది. గురువారం హిజ్బుల్లా ప్రయోగించిన నిఘా డ్రోన్‌ను తాము అడ్డుకున్నామని, ఇది, ఇజ్రాయిల్‌, లెబనాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇజ్రాయిల్‌ పేర్కొంది. నవంబరు చివరిలో హిజ్బుల్లా, ఇజ్రాయిల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తొలుత జనవరి 26వరకే ఈ ఒప్పందం అమల్లో వుంటుందని ప్రకటించినా తర్వాత ఫిబ్రవరి 18వరకు పొడిగించారు. అప్పటి వరకు ఈ ఒప్పందం అమలవుతుందని అమెరికా కూడా గత ఆదివారం ధ్రువీకరించింది. ఆలోగా ఇజ్రాయిల్‌ బలగాలు లెబనాన్‌ నుండి ఉపసంహరించాల్సిందేనని లెబనాన్‌ అధ్యక్షుడు జోసెఫ్‌, ఈజిప్ట్‌ విదేశాంగ మంత్రి బాదర్‌కు స్పష్టం చేశారు. ఎలాంటి జాప్యాన్ని సహించేది లేదని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించినప్పటి నుండి లెబనాన్‌ గడ్డపై ఇజ్రాయిల్‌ పలు దాడులు జరిపింది. వందమందికి పైగా గాయపడ్డారు.

ముగ్గురు బందీల విడుదల : హమాస్‌

ముగ్గురు బందీలను గాజాలో శనివారం విడుదల చేయనున్నట్లు హమాస్‌ సాయుధ విభాగమైన ఖసమ్‌ బ్రిగేడ్స్‌ వెల్లడించింది. జైళ్లలో ఉన్న 90మంది పాలస్తీనియన్లను విడుదల చేయనున్నట్లు ఇజ్రాయిల్‌ ప్రకటించిందని పాలస్తీనా ఖైదీల మీడియా కార్యాలయం తెలిపింది. వెస్ట్‌ బ్యాంక్‌లోని జెనిన్‌ శరణార్ధ శిబిరంపై జరిగిన దాడిలో మరో ఇద్దరిని ఇజ్రాయిల్‌ బలగాలు కాల్చిచంపాయి. గాజా తీరంలో ఇజ్రాయిల్‌ గన్‌బోట్‌ల వల్ల ఒక జాలరి కూడా మరణించాడు. గురువారం విడుదలైన ఐదుగురు థాయి జాతీయలు పూర్తి ఆరోగ్యంతో వున్నారని ఇజ్రాయిల్‌ డాక్టర్లు వెల్లడించారు. హమాస్‌ బందించిన వారిలో మొత్తంగా 31మంది థాయి జాతీయులు వున్నారు. థాయి బందీలను విడుదల చేసేటప్పుడు డజన్ల సంఖ్యలో ఇజ్రాయిల్‌ డాక్టర్లు, నర్సులు, ఇజ్రాయిల్‌ ప్రతినిధులు ఇజ్రాయిల్‌, థాయిలాండ్‌ పతాకాలను ఊపుతూ, పాటలు పాడుతూ హర్షం వ్యక్తం చేశారు.

➡️