జెనీవా : గాజాలో లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను ఇజ్రాయిల్ క్రమబద్ధంగా ధ్వంసం చేసిందని ఐక్యరాజ్యసమితి విచారణ కమిషన్ గురువారం పేర్కొంది. పునరుత్పత్తి కేంద్రాలపై ఇజ్రాయిల్ దాడులను ‘జాతిహత్యలు’గా అభివర్ణించింది. పాలస్తీనా భూభాగంలోని ప్రధాన సంతానోత్పత్తి కేంద్రాన్ని ఇజ్రాయిల్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి నాశనం చేసిందని పేర్కొంది. దాడుల సమయంలో ముట్టడి చేసి, సురక్షితమైన గర్భాలు, ప్రసవాలు మరియు నవజాత శిశు సంరక్షణను నిర్థారించే మందులు సహా సహాయన్ని అడ్డుకుందని తెలిపింది.
పునరుత్పత్తి కేంద్రాలను క్రమబద్ధంగా ధ్వంసం చేయడం ద్వారా ఇజ్రాయిల్ అధికారులు పాలస్తీనియన్ల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పాక్షికంగా నాశనం చేశారని కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడులు, అనంతరం గాజాలో ఇజ్రాయిల్ దాడులు రెండు వర్గాల మారణహోమ చర్యలుగా మారాయని కమిషన్ పేర్కొంది. నేరం అంటే జాతి లేదా భాష, మత సమూహాన్ని పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసం చేసే ఉద్దేశంతో చేపట్టిన చర్యలు అని ఐరాస జెనోసైడ్ కన్వెన్షన్ నిర్వచించింది.